జి.హెచ్.యం.సి.ఎన్నికలకి తెరాస వ్యూహం బెడిసి కొట్టినట్లే ఉంది

హైదరాబాద్ నగరపాలక సంస్థ (జి.హెచ్.యం.సి.) కు గతేడాది డిశంబర్ లోనే ఎన్నికలు నిర్వహించవలసివున్నప్పటికీ, పెరిగిన జనాభాకి అనుగుణంగా ప్రస్తుతం జి.హెచ్.యం.సి.పరిధిలో ఉన్న 150 డివిజన్లను విభజించి 200కి పెంచాలనే వంకతో తెలంగాణా ప్రభుత్వం ఇంతవరకు ఎన్నికలు నిర్వహించకుండా కాలక్షేపం చేస్తోంది. కానీ అసలు కారణాలు వేరే ఉన్నాయని అనడరికీ తెలుసు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంద్రకు చెందిన ప్రజలే ఎక్కువ స్థిరపడి ఉన్నారు. వారి పట్ల తెరాస ఎప్పుడూ ఏహ్యత ప్రదర్శిస్తున్న కారణంగా వారికీ దాని పట్ల మంచి అభిప్రాయం లేదు. తెలంగాణా సెంటిమెంటుతో తెరాస అధికారంలోకి వచ్చినప్పటికీ వారి ముందు అది పని చేయదు. అందుకే డివిజన్ల సంఖ్యను పెంచాలనే సాకుతో ఎన్నికలు వాయిదా వేసుకోస్తోంది. డివిజన్ల సంఖ్యని 200కి పెంచుతూ ఏప్రిల్ నెలలో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అప్పటి నుండి తెలంగాణా ప్రభుత్వాన్ని హైకోర్టు ఎన్నిసార్లు నిలదీసినా కోర్టుకి కూడా అదే కారణం చెపుతోంది. కానీ ఇంతవరకు డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయలేదు కానీ ఏవో కారణాలు చూపిస్తూ జి.హెచ్.యం.సి. పరిధిలోని ఆంధ్రా ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితాల నుండి తొలగించే ప్రక్రియ మాత్రం దిగ్విజయంగా కొనసాగిస్తోంది. తెలంగాణా ప్రభుత్వం సుమారు 25లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని గురించి ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేసారు. రోడ్ల మీదకు వచ్చి నిరసనలు కూడా తెలియజేసారు. నేటి నుండి మళ్ళీ ప్రారంభం కాబోతున్న శాసనసభ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవసరమయితే దీనిపై న్యాయపోరాటం కూడా చేస్తామని తెరాస ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జి.హెచ్.యం.సి.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు నవంబర్ 15వరకు గడువు ఇచ్చింది. బహుశః ఈ పరిణామాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి. పరిధిలో డివిజన్ల పునర్విభజనను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యధా ప్రకారం జి.హెచ్.యం.సి.లో 150 డివిజన్లే ఉంటాయని తన తాజా ఉత్తర్వులలో పేర్కొంది. దాదాపు ఏడాది గడిచిన తరువాత ఇప్పుడు తాపీగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంది. అంటే డివిజన్ల పునర్విభజన అనేది ఎన్నికలను వాయిదా వేసేందుకు ఒక సాకు మాత్రమేనని అర్ధమవుతోంది. కానీ దీనిపై ప్రతిపక్షాలకు సంజాయిషీ చెప్పుకోవలసి ఉంటుంది కనుక జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ ప్రభుత్వానికి వ్రాసిన లేఖను సిద్దంగ ఉంచుకొంది. డివిజన్ల పునర్విభజన చేస్తున్నప్పుడు డివిజన్ల భౌగోళిక సరిహద్దులు సక్రమంగా రావట్లేదని, పైగా పరిపాలనాపరమయిన సమస్యలు కూడా తలెత్తుతాయని ఆయన లేఖలో వ్రాసారు. అయితే ఇటువంటి సమస్యలు ఎదురవుతాయని తెలంగాణా ప్రభుత్వానికి అధికారులు ముందే చెప్పారు. కానీ ప్రభుత్వ ఉద్దేశ్యం డివిజన్ల పునర్విభజన కాదు కనుక వారి సలహాలను అప్పుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పట్టించుకొని అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఏడాది కాలం వృదా చేసిన తరువాత డివిజన్ల పునర్విభజన జరుగలేదు. ప్రతిపక్షాలు అడ్డుపడటంతో ఆంధ్రా ఓటర్ల పేర్లను పూర్తిగా తొలగించడానికి వీలుపడలేదు. కనుక ఇంత చేసినా తెరాసకు విజయావకాశాలు మెరుగవలేదు పైగా ఆంధ్ర ఓటర్లను మరింత దూరం చేసుకొంది. అంటే తెలంగాణా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిందని అర్ధమవుతోంది. తెరాస ప్రభుత్వం ఈ విధంగా ఉత్తర్వులు జరీ చేయడం ఆనక వాటిని ఉపసంహరించుకోవడం వలన ప్రభుత్వమే ప్రజలలో, రాజకీయ వర్గాలలో చులకన అవుతోంది కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com