తెలంగాణలో జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగింది. రెండు కార్పొరేషన్లు.. ఐదు మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్లా.. టీఆర్ఎస్‌నే విజయం సాధించింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ కాస్త పోటీ ఇచ్చింది. మొత్తం 66 డివిజిన్లు ఉన్న కార్పొరేషన్‌లో.. టీఆర్ఎస్ 50 వరకూ గెలుచుకోనుంది. బ్యాలెట్లతో ఓటింగ్ జరగడంతో కౌంటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ట్రెండ్స్‌ను బట్టి… టీఆర్ఎస్కు యాభై కార్పొరేటర్ల బలం చేకూరే అవకాశం ఉంది. ఖమ్మం కార్పొరేషన్‌లోనూ టీఆర్ఎస్ హవా కనిపిస్తోంది.
అయితే అక్కడ కాంగ్రెస్ కాస్త గట్టి పోటీ ఇస్తోంది. అరవై స్థానాలున్న ఖమ్మం కార్పొరేషన్‌లో టీఆర్ఎస్ నలభై వరకూ గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ముఫ్పై స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. మంత్రి పువ్వాడ అజయ్.. వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ఎన్నికల కోసం పని చేశారు. ఇక ఎన్నికలు జరిగిన ఐదు మున్సిపాల్టీలు అయిన సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది.
అచ్చంపేట, కొత్తూరులో మాత్రం కాంగ్రెస్ కాస్త పోటీ ఇచ్చింది. మినీ మున్సిపల్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ కూడా.. ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కరోనా వచ్చి ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ.. పార్టీ నేతలకు ఎప్పటికప్పటికి దిశానిర్దేశం చేశారు. అన్ని చోట్లా.. ఏకపక్ష ఫలితాలు సాధించడంతో.. బీజేపీ .. ఒక్క వరంగల్‌లో తప్ప.. ఎక్కడా కాస్త కూడా ప్రభావం చూపకపోవడంతో… కేసీఆర్ మిషన్ పూర్తయినట్లయింది.