ప్రొ.నాగేశ్వర్ : టీఆర్‌ఎస్‌తో దోస్తీతో జగన్‌కు చిక్కులేనా..?

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు… తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి.. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామి అయ్యేందుకు సిద్ధపడింది. లోటస్‌పాండ్‌కు వెళ్లి.. కేటీఆర్.. జగన్‌తో సమావేశం కావడాన్ని తెలుగుదేశం పార్టీ.. చాలా దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఓ రకంగా ఆంధ్రా సెంటిమెంట్‌ను పెంచాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం.. జగన్ – కేటీఆర్ భేటీపై తీవ్రమైన విమర్శలు చేస్తోంది. అయితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. కేసీయార్‌పై ఏపీలో అంత తీవ్రమైన వ్యతిరేకత లేదని అంచనా వేసుకుంటోంది.

కేసీఆర్‌తో జగన్ కలిసింది జాతీయ కోణంలోనేనా..?

రాష్ట్ర విభజన సమయంలో.. ఏపీలో.. కేసీఆర్‌పై ఉన్నంత వ్యతిరేకత.. ఇప్పుడు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. కొన్ని రోజుల క్రితం.. కేసీఆర్ విశాఖ వెళ్లినప్పుడు.. పెద్ద సంఖ్యలో జనం స్వాగతం చెప్పారని.. కేసీఆర్ చెప్పుకున్నారు. సరిగ్గా ఇదే ఆలోచనతో… కాంగ్రెస్‌ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. దానికి ఫలితాలు ఎలా వచ్చాయో చూశాం. అయితే… కేసీఆర్‌పై వ్యతిరేకత లేదన్న భావనతో.. కేసీఆర్‌పై నెగెటివ్ రియాక్షన్ ఉండదని… వైసీపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఓ బలమైన కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇది చంద్రబాబుకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే.. విభజన హామీలు అమలు చేయాల్సింది కేంద్రం. కేంద్రం అండగా ఉంటేనే.. ఏపీ నడుస్తుందనే భావన ఉంది. కేంద్రం సహకారం కావాలంటే.. ఏపీ ఎంపీలు అండగా ఉన్న ప్రభుత్వం రావాలి. బీజేపీ.. ఎలాంటి సాయం చేయలేదు కాబట్టి.. ఇక ఉన్న ఒకే ఒక ఆప్షన్‌ కాంగ్రెస్. అందుకే చంద్రబాబు… ఈ జాతీయ కూటమి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి పాజిటివ్‌ పాయింట్‌ కూడా వైసీపీకి కూడా ఒకటి ఉండాలన్న ఉద్దేశంతో.. ఫెడరల్ ఫ్రంట్ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు మాత్రమే… జగన్ కూడా జాతీయ రాజకీయాల్లో ఉన్నారని చెప్పుకోవడానికి ఈ ఫెడరల్ ఫ్రంట్ ఉపయోగపడుతోంది.

తెలంగాణలోలా ఏపీలో సెంటిమెంట్ పెరుగుతుందా..?

చంద్రబాబునాయుడు గొప్ప రాజకీయ వ్యూహచతురుడనే పేరు ఉంది. జగన్ ఆయన వ్యూహాలకు తట్టుకోలేరన్న భావన ఉంది. దీన్ని తిప్పికొట్టడానికి.. చంద్రబాబును.. ఢీకొట్టగలిగే వ్యూహారాలు రూపొందించగలని చెప్పడానికికూడా ఈ ఫెడరల్ ఫ్రంట్ భేటీ ఉపయోగపడింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎవర్నీ కలుపుకుని పోరన్న భావన ఉంది. దీన్ని తగ్గించి.. జాతీయ రాజకీయాల్లో కొంత మందితో కలసి వెళ్తారని చెప్పడానికైనా.. టీఆర్ఎస్‌తో కలుస్తున్నామనేది.. వైసీపీ నేతల వాదన. అయితే తెలంగాణ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం.. తెలంగాణ ఎన్నికల్లో సోషల్ మీడియాలో.. లగడపాటి సర్వేలు వచ్చిన తర్వాత.. మహాకూటమి గెలుస్తుందని ప్రచారం జరిగిన తర్వాత… చంద్రబాబు ప్రచారజోరును మరింత పెంచారు. అప్పుడే.. కేసీఆర్.. ఈ సెంటిమెంట్‌ను మరింత రగిలించారు. చంద్రబాబు దండయాత్రకు వచ్చారని చెప్పి.. ఫలితాలను అనుకూలంగా మార్చుకోగలిగారు. ఇప్పుడు ఏపీలోనూ అదే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

కేసీఆర్ ఏపీ ప్రచారానికి వెళ్తే ఏం జరుగుతుంది..?

ఫెడరల్ ఫ్రంట్ భేటీలతోనే… కేసీఆర్ ఆపేస్తే.. సెంటిమెంట్ పెద్దగా పెరగపోకవచ్చు. కానీ.. ఏపీకి వెళ్లి అక్కడ .. ప్రచారం చేయడం.. చేస్తే మాత్రం… తెలంగాణలో టీఆర్ఎస్ పెంచినట్లు.. అక్కడ టీడీపీ సెంటిమెంట్ పెంచుతుంది. ఇప్పుడే ఈ దిశగా టీడీపీ.. ప్రచారం కూడా చేస్తోంది. అదే జరిగితే.. ఆంధ్రా లో కూడా సెంటిమెంట్ బాగా పెరుగుతుంది. కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తే .. కచ్చితంగా జగన్‌కు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో… ఏపీలో జగన్‌కు అవే ఎదురవుతాయి. సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులను జగన్ సమర్థిస్తారా.. అని ప్రశ్నలు వస్తాయి. పోలవరంను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని.. అలాంటి నేతతో… జగన్ ఎలా కలుస్తారని… టీడీపీ విమర్శలు చేస్తున్నారు. పోలవరాన్ని వ్యతిరేకిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లో జగన్ ఎలా కలుస్తారని అడుగుతున్నారు.

వివాదాస్పద ప్రాజెక్టులు, వివాదాలపై జగన్‌ సమాధానం చెప్పుకోగలరా..?

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్.. ఏపీకి నష్టమనే వాదన ఎప్పట్నుంచో ఏపీలో ఉంది. ఈ ప్రాజెక్టులన్నింటినీ జగన్… ఆమోదిస్తారా..? అలాగే విద్యుత్ బకాయిలు, షెడ్యూల్ నైన్, టెన్ సంస్థల సంగతేమిటి..?, విద్యుత్ ఉద్యోగుల విభజన సంగతేమిటి..? అని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విషయాలన్నింటిపై క్లారిటీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని… టీడీపీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. అంటే.. ఏపీలో.. కేసీఆర్… ఎన్నికల ప్రచారం చేస్తే… ఆంధ్రా సెంటిమెంట్ మరింత రగలడం ఖాయం. పాత గాయాల్ని రేపుతారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమే. ఇప్పటి వరకూ ఉన్న ట్లయితే.. సెంటిమెంట్ పెద్దగా పెరిగే అవకాశం లేదు. కానీ కేసీఆర్ ఇంత కన్నా.. ముందుకెళ్తే.. అది జగన్‌కే ఇబ్బందికరం అయ్యే అకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.