ఎడిటోరియల్: సంక్షేమంతో సక్సెస్..! రాజకీయం రాత మార్చిన గులాబీ దళపతి…!

kcr

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. కులమతాల ఈక్వేషన్స్‌కు అతీతంగా… అతి పెద్ద విజయాన్ని నమోదు చేశారు. తెలంగాణనే తమ కులం అని ప్రజలంతా అనుకునేలా వారిని ఏకం చేశారు. హామీల అమలు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా… ప్రజల సంక్షేమ విషయంలో తాము ప్రజల బాగు కోసం కట్టుబడ్డామని… ఇబ్బడిమబ్బడిగా వెల్లువెత్తిన పథకాల ద్వారా నిరూపించారు. అంతిమ ఫలితం సాధించారు.

పారిన “పథకం”..!

మేనిఫెస్టోలో పెట్టినవి చేసినా చేయకున్నా… కొత్త ఆలోచన వచ్చిన ప్రతీ సారి ఖర్చుకు వెనుకాడకుండా చేసి చూపించారు. 24 గంటల ఉచితకరెంట్‌ , రైతు బంధు , రైతు బీమా, పెన్షన్లు , కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్‌ , కేసీఆర్‌ కిట్స్‌ , కంటివెలుగు, రుణమాఫీ లాంటి పథకాలతో తెలంగాణ ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. ఈ పథకాలు ఓ కొత్త చరిత్రను సృష్టించాయి. పథకాల్లో లోపాయిలున్నాయని… విమర్శలు వచ్చినా ఆయన … అనుకున్నదానికే కట్టుబడ్డారు. రైతు బంధు పథకంలో కౌలు రైతులకు సాయం అందడం లేదని వచ్చిన విమర్శలు పట్టించుకోలేదు. నిర్మోహమాటంగా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేశారు. అలా.. ప్రతీ విషయంలోనూ.. నిక్కచ్చిగా ఉంటూ తనదైన అభిప్రాయాలతో.. అనితర సాధ్యమైన విజయాన్ని నమోదు చేశారు.

కలిసొచ్చిన కుటుంబం..!

సాధారణంగా రాజకీయ నాయకులకు కుటుంబాలు మైనస్ అవుతూ ఉంటాయి. వారు మంచి చేసినా సరే ప్రజాస్వామ్యంలో.. ఓ నాయకుడు తనకు బదులుగా .. తన కుటుంబ జోక్యాన్ని పెంచుకుంటూ పోతే… అంతిమంగా అది వ్యతిరేకతకు కారణం అవుతుంది. ఓడిపోయిన తెలంగాణ మంత్రుల్లో ఒకరిద్దరు, స్పీకర్ మధుసూదనాచారి కూడా… కుమారుల జోక్యం వల్లే… ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. కానీ… కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా కూడా.. వారి జోక్యం.. ప్రజలను ఏ మాత్రం ఇబ్బందికరంగా మారలేదు. దానికి కారణం.. వారు కూడా టీఆర్ఎస్‌లో సాధారణ నాయకుల్లా మారిపోయి … రాజకీయం చేశారు కానీ.. తాము ఎక్కడా అధికార కేంద్రానికి దగ్గర బంధువులమని అహం ప్రదర్శించలేదు. ఫలితంగా ప్రజామోద లభించినట్లయింది.

కేటీఆరే కేసీఆర్ సైన్యం..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు ఆయన కుమారుడు.. ఓ సైన్యంలా మారారు. ప్రజల కోసం కేసీఆర్ ఇరవై నాలుగు గంటలూ ఆలోచించి… కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తూంటే… ఆయన కుమారుడు కేసీఆర్ వాటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి సక్సెస్ అవుతున్నారు. పరిశ్రమలను తీసుకురావడంతో పాటు.. బంగారు తెలంగాణ దిశగా… కేసీఆర్‌ది ఆలోచన అయితే.. కేటీఆర్‌ది ఆచరణ. ప్రభుత్వ పరంగానే కాదు.. రాజకీయ పరంగానూ… కేసీఆర్‌ కు కేటీఆర్ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. గ్రేటర్ బాధ్యతల్ని తీసుకున్నారు. కేసీఆర్ ఒక్క రోజు మాత్రమే.. గ్రేటర్‌లో సభ పెట్టారు. కానీ కేటీఆర్ అన్ని చోట్లా ప్రచారం చేసి.. ఘన విజయాల్ని సాధించి పెట్టారు.

బంగారు తెలంగాణకు బుడిబుడి అడుగులు..!

ప్రజలందరితో తమతి తెలంగాణ కులమని కేసీఆర్ నిరూపించగలిగారు. ఆంధ్రా, ఉత్తరాది అనే తేడా లేకుండా.. అందరూ టీఆర్ఎస్‌కే జైకొట్టేలా తన చేతలతోనే.. వ్యవహారాలను నడిపారు. ఇప్పుడు అందరూ ఆయన వెంటే ఉన్నారు. బంగారు తెలంగాణ దిశగా.. ఆయన ఆలోచనలను మరింత ధృడంగా అమలు చేసే అవకాశం దక్కింది. ప్రజలు కూడా.. ఆయన బంగారు తెలంగాణ సాధించి చూపెడతారని ఆశ పడుతున్నారు. అది ఆశ కూడా.. కేసీఆర్ సామర్థ్యం పై నమ్మకం. జై..హో కేసీఆర్.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com