టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే అస్త్రం “ఇంటర్ ఆత్మహత్యలే”..!?

తెలంగాణను గురి పెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను హైలెట్ చేసుకోవాలనే ఆలోచనను.. పద్దతి ప్రకారం.. అమల్లోకి తెస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఇష్యూ.. మరుగున పడిపోయిందనుకునే దశలో.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అనూహ్యంగా తాఖీదు అందింది. మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని.. తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. ఇది తెలంగాణ సర్కారులో కలకలం రేపింది. ఆగస్టు పదిహేనున… ఎట్ హోం కార్యక్రమంలో విందు కోసం వెళ్లిన కేసీఆర్.. గవర్నర్ తో ఇదే విషయంపై ఎక్కువగా మాట్లాడినట్లుగా మీడియా వర్గాలు ప్రచురించాయి. అదంతా కుట్ర అన్నట్లుగా చెప్పారని చెబుతున్నారు. అంటే తెలంగాణ సీఎం కూడా.. కేంద్రం ఆలోచనల పట్ల ఆందోళనగా ఉన్నారని చెబుతున్నారు.

నిజానికి ఇంటర్ ఫలితాల్లో దొర్లిన తప్పిదాలు…ఆ తర్వాత 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దేశవ్యాప్త కలకలకానికి కారణం అయింది. ఆ క్రమంలో.. ఇంటర్ బోర్జుతో కాంట్రాక్టులో ఉన్న గ్లోబరీనా సంస్థ వ్యవహారం మరింత వివాదాస్పదం అయింది. ఆ సంస్థ విషయంలో… తీవ్ర స్థాయిలో నిబంధనల ఉల్లంఘన, అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అది తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులదని.. ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే.. గ్లోబరీనాకు సంబంధించి… అన్ని అవకవతవకలు బయటపడినప్పటికీ… ఆ సంస్థపై ఈగవాలనీయలేదు. దీంతో గూడుపుఠాణి జరిగిందనే అభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.

కేంద్రంలో అధికారం ఉండటంతో… ఈ అంశం ఆధారంగా.. తెలంగాణ సర్కార్ పై పోరాటానికి బీజేపీ … ఈ అంశాన్ని వాడుకోవాలని నిర్ణయించుకుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే.. ఈ అంశాన్ని వారు ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లారు. బీజేపీ ఎంపీలు పార్లమెంట్ లో ప్రస్తావించారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కొంత ఆలస్యంగా.. నివేదిక కోరారు. ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా .. కేంద్రం తదుపరి చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. బహుశా.. సీబీఐ విచారణకు ఆదేశించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. కానీ.. కేంద్రం ఇలాంటి విషయాల్లో నేరుగా సీబీఐ విచారణకు ఆదేశించడానికి అధికారం లేదు. కోర్టు ఆదేశిస్తే మాత్రం విచారణ జరిపించవచ్చు. మరి ఏ కోణంలో.. బీజేపీ.. ఈ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను… టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటానికి వినియోగించబోతోందో.. ముందు ముందు బయటపడనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com