అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పట్టించుకోకపోతే ఆయన దారికి వస్తారు. ఈ విషయం భారత్ విషయంలో మరోసారి నిరూపితమవుతోంది. ట్రంప్ విధించిన టారిఫ్‌లను భారత్ పట్టించుకోలేదు. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపలేదు. చాలా సార్లు ఇక భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని ప్రకటనలు చేశారు.కానీ భారత్ మాత్రం.. ఆ ఏకపక్ష ప్రకటనల్ని పట్టించుకోలేదు. రష్యా నుంచి చమురు ఎప్పట్లాగే కొనుగోలు చేస్తోంది.
ఏం చేసినా భారత్ తగ్గకపోవడంతో ట్రంప్ దిగి వస్తున్నారు. భారత్ తో ట్రేడ్ డీల్ కు సిద్ధమయ్యారు. టారిఫ్‌లన్నీ తగ్గించేసి.. పదిహేను శాతం వరకూ టారిఫ్‌లు ఉంచేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే అమెరికన్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. చర్చలు తుది దశలో ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో ట్రంప్ స్వరం మారింది. రష్యా నుంచి ఆయిల్ పెద్ద ఎత్తున కొనుగోలు చేయదని..కొంతే కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. భారత్ అసలు కొనవొద్దని ట్రంప్ అంటూ వచ్చారు. ఇప్పుడు భారీగా కొనవద్దని అంటున్నారు. అలాంటివేమీ పట్టించుకోకుండా భారత్ ట్రంప్‌ను దారికి తెచ్చుకుంటోంది.
టారిఫ్‌ల పేరుతో ట్రంప్ చేస్తున్న విన్యాసాలు అమెరికా ప్రజలకే సమస్యగా మారాయి. టారిఫ్‌లు పెరిగిపోయి.. జీవన ప్రమాణాలు తగ్గిపోతూండటంతో అక్కడి ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. నో కింగ్స్ పేరుతో జరుగుతున్న ఉద్యమం ఇలాంటిదే. అందుకే ట్రంప్ దిగి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ ను దూరం చేసుకోవడం ఎంత నష్టమో ఆయన త్వరగానే తెలుసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఈ వారంలోనే భారత్, అమెరికా ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలు ఉన్నాయి. భారత ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం కాకుండా..ఈ డీల్ పూర్తి చేయనున్నారు.