నీ స్నేహితుడెవరో చెప్పు.. నీవెలాంటివాడివో చెబుతానని కొంత మంది పెద్దలు అంటూ ఉంటారు. మంచి స్నేహితులు ఉంటే.. బాగుపడతావని.. చెడ్డ స్నేహితులు ఉంటే ఇక మర్చిపోవడం మంచిదని లెక్కలేస్తారు. ఆ లెక్కన అసలు స్నేహితులు లేని వాళ్లు.. శత్రువుల్ని మాత్రమే పెంచుకునేవాళ్లు ఏమవుతారు ?. అందరూ కలిసి కొట్టే దెబ్బకు కనిపించకుండా పోతారు. ఇప్పుడు అమెరికా పరిస్థితి అలాగే ఉంది.
స్నేహితుల్ని తమ ఆస్తులు దోచుకుంటున్న వారిగా చూస్తున్న ట్రంప్
ప్రపంచ పెద్దన్నగా పై స్థాయిలో ఉండాల్సిన అమెరికాను ట్రంప్ పాతాళానికి తీసుకుపోతున్నారు. ఆ దేశానికి ఇప్పుడు నమ్మకమైన మిత్రపక్షం ఒక్కటీ లేదు. పాకిస్తాన్ ను మిత్రపక్షం అనుకుంటున్న ట్రంప్.. అసలు చైనా గుప్పిట్లో పాక్ ఉందన్న సంగతి గుర్తించలేకపోతున్నారు. ట్రంప్ పదవి చేపట్టక ముందు నుంచి స్నేహితుల్నే టార్గెట్ చేశాడు. తమతో సరిహద్దులు పంచుకునే దేశాలతో పరాచికాలు ఆడాడు. కెనడా, మెక్సికో, పనామా, డెన్మార్క్ , కొలంబియా వంటి సాంప్రదాయ మిత్ర దేశాలపై కఠిన వైఖరి అవలంబించారు. కెనడాను కలిపేసుకుంటానంటూ ఎగతాళి చేశారు. 25 శాతం టారిఫ్‌లు వేశాడు. పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకోవాలని బెదిరించడం వంటి చర్యలు మిత్ర దేశాలతో సంబంధాలను దెబ్బతీశాయి.
నాటో దేశాలు సహా అందరూ అమెరికాకు దూరం ..దూరం !
ఇక టారిఫ్‌లతో భారత్ వంటి మిత్రదేశాలను దూరం చేసుకున్నారు. ఇప్పుడు భారత్‌కు రష్యా మరింత దగ్గర అయింది. సాధారణంగా అధ్యక్షుల స్థాయి వ్యక్తులతోనే సమావేశం అయ్యే పుతిన్..భారత రక్షణ సలహాదారు ధోబాల్తో మాస్కోలో సమావేశం అయ్యారు. ఇది భారత్ కు ఆయన ఇస్తున్న ప్రాధాన్యం తెలియచేస్తోంది. ఇప్పుడు అమెరికాకు భారత్ దూరమైనట్లే. యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా NATO సభ్య దేశాలు కూడా అమెరికాను నమ్మడం తగ్గించాయి. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి మిత్ర దేశాలు అమెరికాకు సంబంధాలు అంటీ ముట్టనట్లుగా ఉంచుకోవడం మంచిదని అనుకుంటున్నాయి.
యూఎస్ ఎయిడ్ నిలిపివేతతో పేద దేశాలూ అమెరికాకు వ్యతిరేకమే!
అమెరికా తన ధనబలంతో ఐక్యరాజ్య సమితి ద్వారా ఇత దేశాలకు కొంత సాయం చేసేసి. వాటిని ట్రంప్ ఉపసంహరించేసుకున్నారు. యూఎస్ ఎయిడ్ మొత్తాన్ని ఆపేశారు. ఫలితంగా అమెరికా మానవతా సహాయ కార్యక్రమాలు దెబ్బతిన్నాయి. ఇది చైనా వంటి ఇతర దేశాలు ఆఫ్రికా , గ్లోబల్ సౌత్‌లో ప్రభావాన్ని విస్తరించే అవకాశం కల్పించింది. ఇప్పుడు ఎవరైనా అమెరికాతో స్నేహంగా ఉంటున్నారంటే.. అది ట్రంప్ ఇస్తామని చెప్పే చిల్లర్ లేదా అలాంటి వాడితో పెట్టుకోవడం ఎందుకన్న భయంతోనే. నిఖార్సుగా అమెరికాకు స్నేహితులు ఇప్పుడెవరు లేరు. అది అమెరికా భవిష్యత్ ను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.