నేను నీతో ఫ్రెండ్ షిప్ చేసినా నీకే డేంజర్. నువ్వు నాతో ఫ్రెండ్ షిప్ చేసినా నీకే డేంజర్ అనే డైలాగ్ ను పాకిస్తాన్ కు నిజం చేసి చూపిస్తున్నారు ట్రంప్. ఆర్మీ చీఫ్ మునీర్‌ను వైట్ హౌస్ కు పిలిచి టీ ఇచ్చి పంపించిన ట్రంప్ ఇప్పుడు ప్రతిఫలంగా హమాస్ పై దాడి చేయమని పాకిస్తాన్ పై ఒత్తిడి చేస్తున్నారు. అలా చేస్తే పాకిస్తాన్ పని అయిపోతుంది. అందుకే మునీర్ అనవసరంగా ట్రంప్ తో స్నేహం చేశానని కంగారు పడుతున్నారు.
గాజాలో శాంతి కోసం పావుగా పాకిస్తాన్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన అంతర్జాతీయ శాంతి దళంలో పాకిస్తాన్‌ను భాగస్వామిని చేసేందుకు అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ట్రంప్ తీవ్రంగా ఒత్తిడిచేస్తున్నారు. శాంతిదళం బాధ్యతలలో హమాస్‌ను నిర్వీర్యం చేయడం కూడా ఒకటి. హమాస్‌ను నిరాయుధులను చేయాల్సి ఉంటుంది. ఈ దళంలో ముస్లిం దేశాల సైన్యం ఉంటేనే స్థానిక పాలస్తీనియన్ల నుండి ఆమోదం లభిస్తుందని ట్రంప్ ప్లాన్. అందుకే పాకిస్తాన్ పై గురి పెట్టారు. ఈ కారణంతోనే ఇటీవల పాక్ ను దువ్వుతున్నారు.
ట్రంప్ ఒత్తిడితో పాక్ ఉక్కిరిబిక్కిరి
అమెరికా ప్రతిపాదనపై పాకిస్తాన్ ఆచితూచి స్పందిస్తోంది. అంతర్జాతీయ శాంతి దళంలో భాగం కావడానికి తాము సిద్ధమేనని, అయితే హమాస్ నుంచి ఆయుధాలు లాక్కోలేమని అంటోంది. శాంతి స్థాపన, మానవతా సాయం పంపిణీకి మాత్రమే తమ సైన్యాన్ని పరిమితం చేయాలని పాక్ కోరుతోంది. సుమారు 3,500 మంది సైనికులను పంపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇలా ఓ సారి గాజాకు పాక్ సైనికులు వెళ్లిన తరవాత అది ముస్లిం సమాజానికి పాక్ చేస్తున్న ద్రోహంగానే ముద్ర పడుతుంది.
ఇస్లామిక్ సంస్థలు తిరుగుబాటు చేసే అవకాశం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన 20 అంశాల శాంతి ప్రణాళికలో భాగంగా పాకిస్తాన్‌కు పెద్ద పీట వేస్తున్నారు. అమెరికా నుంచి ఆర్థిక పెట్టుబడులు, భద్రతాపరమైన సాయం , వాణిజ్య రాయితీలను పొందాలని చూస్తున్న పాకిస్తాన్‌కు ఇది ఒక అరుదైన అవకాశం. పాకిస్తాన్ సైన్యం గాజాకు వెళ్లడం అనేది ఆ దేశంలో రాజకీయంగా పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం పాక్ సైన్యం పనిచేస్తోందనే భావన వస్తే, దేశంలోని ఇస్లామిక్ సంస్థలు, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భయపడుతోంది. ముఖ్యంగా హమాస్‌ను అణచివేసే చర్యల్లో పాక్ సైన్యం పాల్గొంటే, అది దేశీయంగా అశాంతికి దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హమాస్ వ్యతిరేకతను ఎదుర్కోకుండా, అమెరికా స్నేహాన్ని నిలబెట్టుకుంటూ ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడాలనేది ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న అతిపెద్ద సవాలు. కానీ పాకిస్తాన్ ఎలా పోయినా పర్వాలేదు..తాను చేయాలనుకున్నది చేయాలని ట్రంప్ ఇప్పటికే డిసైడయ్యారు.
