అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒంటి చేత్తో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరిగిపోతోందని అనుకుంటున్న సమయంలో ట్రంప్ సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య పూర్తి , తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రకటించారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత, భారత్ , పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని రెండు దేశాలు తెలివిగా , బాధ్యతాయుతంగా తీసుకున్నాయని అభినందించారు.
పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ఈ ప్రకటన నిజమేనని కాల్పుల విరమణకు అంగీకరించామని ట్వీట్ చేశారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. ట్రంప్ గత ప్రకటనలు చూసి ఇదంతా ఆయన గేమ్ ఆడుతున్నారని అనుకున్నారు. కానీ ట్రంప్ ట్వీట్ చేసిన కాసేపటికే.. పాక్ విదేశాంగ మంత్రి తాము కూడా కాల్పుల విరమణ పాటిస్తున్నామని ప్రకటించారు. ఆరు గంటలకు మీడియా ముందుకు వచ్చిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకరిచాయి. సోమవారం ఇరు దేశాల మిలటరీ జనరల్స్ సమావేశం అవుతారని ప్రకటించారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాయన్నారు.
పహల్గాం దాడి తర్వాత.. భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేయడంతో.. భారత్ ప్రతీకార దాడులు చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల వల్ల పలువురు జవాన్ల ప్రాణాలు పోయాయి. పాకిస్తాన్ లోనూ ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. అయితే ఉద్రిక్తతలు ముగిసిపోవడంతో కాస్త రిలీఫ్ వచ్చినట్లే అనుకోవచ్చు.