అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన టారిఫ్లతో అత్యధికంగా నష్టపోతోంది ఆంధ్రప్రదేశ్ అక్వారంగమే. మంచి క్వాలిటీ రొయ్యల ఉత్పత్తిలో పేరుగాంచిన ఏపీ రైతులు.. తమ ఉత్పత్తులను అమెరికాకు ఎక్కువగా ఎగుమతి చేస్తూంటారు. ఇప్పుడు టారిఫ్ల కారణంగా ఆర్డర్లన్నీ రద్దు అవుతున్నాయి. దాదాపుగా రూ. 25వేల కోట్ల నష్టం జరుగుతుందని అంచనా. ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. టారిఫ్ల వల్ల నష్టపోతున్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఓ పథకం తెచ్చే ఆలోచన చేస్తున్నామని కేంద్రం ఇప్పటికే ఓ ప్రకటన చేసింది.
రొయ్యల రైతులకు భారీగా నష్టం
డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల ఎగుమతి పరిశ్రమకు దాదాపుగా రూ. 25,000 కోట్ల నష్టాన్ని కలిగిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సగానికిపైగా ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యాయి. ఎగుమతి సంక్షోభం వల్ల ఆక్వా రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికా టారిఫ్లు 59.72 శాతానికి చేరాయి. ఇందులో ముందు ప్రకటించిన 25 శాతం మీద మరో 25 శాతం అదనపు టారిఫ్లు, 5.76 శాతం కౌంటర్వెయిలింగ్ డ్యూటీ, 3.96 శాతం యాంటీ-డంపింగ్ డ్యూటీలు ఉన్నాయి. ఈ టారిఫ్ల కారణంగా 200 కంటెయినర్లపై ఏకంగా రూ. 600 కోట్లు అదనపు పన్ను చెల్లించాల్సి వచ్చింది. అందుకే దిగుమతి దారులు ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
రొయ్యలు అంటే ఏపీ నుంచే !
దేశం నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలలో 80 శాతం, మెరైన్ ఎగుమతులలో 34 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తున్నాయి. రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమపై ఆధారపడి 30 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. 2024-25లో 7.38 బిలియన్ల విలువైన సీఫుడ్ ఎగుమతులు జరిగాయి, ఇందులో 92 శాతం రొయ్యలు. మొత్తం ఎగుమతుల్లో అమెరికాకు 54 శాతం వెళ్తాయి. అందుకే ప్రభావం ఏపీపై తీవ్రంగా ఉంది.
ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం – కేంద్రం నుంచి మరింత సాయం కోసం ప్రయత్నం
టారిఫ్ల వల్ల అక్వా రైతులు , వారి కుటుంబాలు కష్టాల్లో పడ్డారని వారిని ఆదుకునేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అక్వా ఫీడ్ ధరను కేజీకి రూ. 9 తగ్గించింది. కొన్ని అంశాల్లో సబ్సిడీలను ప్రకటించింది. ఎగుమతిదారులు, అక్వా కంపెనీలకు బ్యాంకుల మద్దతు అవసరమని, రుణాలు, వడ్డీ రీపేమెంట్లకు 240 రోజుల మారటోరియం, వడ్డీ సబ్సిడీలు, ఫ్రోజన్ రొయ్య పై 5 శాతం జీఎస్టీ తాత్కాలిక మాఫీ వంటి చర్యలు చేపట్టాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు. అలాగే అమెరికాపై మాత్రమే ఆధారపడకుండా ఇతర ఎగుమతి మార్కెట్లను విస్తరించడానికి ఐరోపా యూనియన్, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, రష్యాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలని చంద్రబాబు కోరారు.
కేంద్రం జోక్యంతోనే సమస్య పరిష్కారం
రాష్ట్ర ప్రభుత్వం ఎంత సాయం చేసినా కేంద్ర జోక్యంతోనే సమస్య పరిష్కారం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నాకు. భారత్ కు పోటీగా ఈక్వెడార్.. సముద్ర ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఈ దేశంపై ట్రంప్ పదిహేను శాతం పన్ను విధించారు. దాంతో పోలిస్తే భారత్ పై చాలా ఎక్కువ పన్నులు వేసినట్లే. భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అక్వారంగానికి మేలు చేసేలా.. డీల్ కుదిరితే..మంచిదే.. లేకపోతే ఆదుకునేందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిందేనని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.


