పశ్చిమాసియాలో ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు రాజకీయాలు ఇరాన్ పతనాన్ని కాకుండా, గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థల విధ్వంసానికి దారితీస్తున్నాయి. ఈ యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్ వంటి దేశాలు ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. కేవలం అమెరికాతో దశాబ్దాలుగా ఉన్న స్నేహం, భద్రతా ఒప్పందాలే ఇప్పుడు ఆయా దేశాలకు శాపంగా మారాయి. ఇరాన్ తన ప్రతిఘటనలో భాగంగా అమెరికా సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలలోని చమురు నిల్వలు, విమానాశ్రయాలు , మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడంతో గల్ఫ్ ప్రాంతం యుద్ధ భూమిని తలపిస్తోంది.
ఆవిరైన భద్రతా ఇమేజ్.. కుప్పకూలిన పర్యాటకం
గల్ఫ్ దేశాలు దశాబ్దాలుగా కష్టపడి నిర్మించుకున్న సురక్షితమైన వ్యాపార కేంద్రం అనే ఇమేజ్ ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నది. ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలపై దాడులు జరగడం, వేలాది విమానాలు రద్దు కావడంతో పర్యాటక రంగం కుప్పకూలిపోయింది. పెట్టుబడిదారులు ఇప్పుడు గల్ఫ్ నుండి తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉండి, ప్రపంచ కుబేరులకు నిలయంగా మారిన ఈ ప్రాంతం, ఇప్పుడు యుద్ధ భయంతో వణికిపోతోంది. ఎంతో కష్టపడి నిర్మించుకున్న అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఒక్కసారిగా ధ్వంసం కావడం ఆయా దేశాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.
చమురు వ్యాపారానికి గొడ్డలి పెట్టు
ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే హార్ముజ్ జలసంధి మూతపడటంతో గల్ఫ్ దేశాల ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. సౌదీ, కువైట్, యూఏఈల చమురు ఉత్పత్తి రోజుకు లక్షల బ్యారెళ్ల మేర పడిపోయింది. ఖతార్ వంటి దేశాల ఎల్ఎన్జీ మౌలిక సదుపాయాలపై దాడులు జరగడంతో ప్రపంచ గ్యాస్ సరఫరాకు విఘాతం కలిగింది. తమ రక్షణ కోసం అమెరికాపై ఆధారపడిన గల్ఫ్ దేశాలకు, కీలక సమయంలో వాషింగ్టన్ నుండి ఆశించిన స్థాయిలో భద్రతా సాయం అందకపోవడం వారిని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. ట్రంప్ తన వ్యూహాలతో గల్ఫ్ దేశాలను ఇరాన్ కోపానికి బలిపశువులను చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కోలుకోవడానికి దశాబ్దాల కాలం?
ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసం నుండి గల్ఫ్ దేశాలు కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో ఊహించడం కూడా కష్టమే. భౌతికమైన మౌలిక సదుపాయాలను మళ్లీ నిర్మించుకున్నా, అంతర్జాతీయంగా పోగొట్టుకున్న భద్రతా నమ్మకాన్ని తిరిగి సంపాదించడం అంత సులభం కాదు. ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు ఇరాన్ను నియంత్రించాయో లేదో కానీ, ఒకప్పుడు ఆర్థికంగా వెలుగు వెలిగిన గల్ఫ్ ప్రాంతాన్ని మాత్రం దశాబ్దాల వెనక్కి నెట్టేశాయి. యుద్ధం ముగిసినా, గల్ఫ్ దేశాలు మళ్లీ మునుపటి వైభవాన్ని పొందాలంటే ప్రపంచ దేశాల సహకారం , శాశ్వత శాంతి ఒప్పందాలు తప్పనిసరి.


