ఆర్టీసీ ఆదాయంలో ఆ 52 రోజుల లెక్క‌లు తేల‌ట్లేద‌ట‌..!

తెలంగాణ‌లో ఆ మ‌ధ్య ఆర్టీసీ స‌మ్మె చాలా తీవ్రంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 52 రోజుల‌పాటు కార్మికులు స‌మ్మె చేశారు. అయితే, స‌మ్మె స‌మ‌యంలో ప్ర‌జ‌లకు ప్ర‌యాణ ఇబ్బందులు క‌లిగించ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ప్ర‌భుత్వ‌మే బ‌స్సుల్ని న‌డిపింది. తాత్కాలిక డ్రైవ‌ర్ల‌ను, సిబ్బందినీ రోజువారీ చెల్లింపుల లెక్క‌లో చాలామందిని విధుల్లోకి తీసుకుంది. డిపోల్లో ఉన్న బ‌స్సుల్ని వారి చేతికి ఇచ్చి… రాష్ట్రంలో అన్ని రూట్ల‌లో తిప్పే ప్ర‌య‌త్నం చేసింది. ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే… స‌మ్మె కాలంలో 52 రోజుల‌పాటు డిపోల‌వారీగా ఆర్టీసీకి వ‌చ్చిన ఆదాయం ఎంత అనే లెక్క‌లు తేల‌డం లేద‌ని స‌మాచారం. ఇంట‌ర్న‌ల్ ఆడిటింగ్ లో పొంత‌న లేని అంకెలు క‌నిపిస్తున్నాయ‌ని అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్న‌ట్టు స‌మాచారం.

స‌మ్మె కాలంలో ఆర్టీసీలో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని యూనియ‌న్ నేత‌లు ఆరోపించారు. కొంత‌మంది అధికారులు త‌మ చేతివాటం ప్ర‌ద‌ర్శించి, ఆర్టీసీ ఆదాయాన్ని త‌మ జేబుల్లో వేసుకున్నారంటూ విమ‌ర్శించారు. ఆ 52 రోజుల‌పాటు బిల్లులూ ర‌సీదుల్లాంటివి ఏవీ లేక‌పోవ‌డంతో కొంత‌మంది బాగా దండుకున్నార‌ని అంటున్నారు. ద‌స‌రా పండుగ స‌మ‌యంలో ఏయే డిపోల్లో ఎంతెంత ఆదాయం వ‌చ్చింద‌నే అంశ‌మై అధికారులు ఇంట‌ర్న‌ల్ ఆడిటింగ్ చేసిన‌ట్టు స‌మాచారం. గడ‌చిన నెల‌రోజుల్లో 15 డిపోల్లో ఆడిటింగ్ చేస్తే… లెక్క‌ల‌న్నీ గంద‌ర‌గోళంగా ఉన్న‌ట్టు తేలింద‌ని తెలుస్తోంది. ఇదే అంశ‌మై టీఎస్ ఆర్టీసీ అధికారుల‌ను ప్ర‌శ్నిస్తే… స‌మ్మె టైమ్ లో తాత్కాలిక సిబ్బందితో బ‌స్సులు న‌డ‌పడం వ‌ర‌కే త‌మ‌కు తెలుస‌నీ, టిక్కెట్లు లెక్క‌లు త‌మ‌కు తెలీవంటూ చేతులు ఎత్తేస్తున్నార‌ట‌.

స‌మ్మె కాలంలో వ‌సూళ్ల లెక్క‌ల అస‌లు రంగు తేలాలంటే మొత్తం 97 డిపోల్లో ప‌క్కా ఆడిటింగ్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే, ప్ర‌స్తుతానికి 15 డిపోల్లో లెక్క‌లే తేలాయి, అవీ పొంత‌న లేనివిగా ఉన్నాయి! మిగిలిన డిపోల్లో లెక్క‌లు ఒక కొలీక్కి రావాలంటే ఇప్ప‌ట్లో జ‌రిగేది కాద‌ని ఆర్టీసీ కార్మికులు కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. ఒక‌వేళ లెక్క‌లు తేలినా… చేతివాటం ఎవ‌రు ప్ర‌ద‌ర్శించార‌నేది కూడా అంత సులువుగా తేలే ప‌నికాదంటున్నారు. స‌మ్మె స‌మ‌యంలో లెక్క‌లు గల్లంత‌య్యాయంటూ ఆరోపిస్తున్న‌వారే ఆధారాలేవైనా బ‌య‌ట‌పెడితే కొంతైనా వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని అంటున్నారు. ఈ వ్య‌వ‌హారంలో అంతిమంగా ఆడిటింగ్ విచార‌ణ అధికారులు ఏం తేలుస్తారో అనేది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com