తెలకపల్లి వ్యూస్ : కెసిఆర్‌పై తుమ్మల తొలి ధిక్కార స్వరం

పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పోటీకి నిలపాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మకమంటున్నా ఆయనకు మాత్రం రాజకీయంగా సవాలే. మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తూ కాలం గడుపుతున్న స్థితిలో మళ్లీ రాజకీయ సమరం వ్యయ ప్రయాసలు అనివార్యంగా వుండే ఉత్కంఠలు ఎదుర్కొనాల్సి వచ్చింది. పైగా ఇన్‌చార్జిగా కెటిఆర్‌ను నియమించడం ఆయన వంటి సీనియర్‌కు మింగుడు పడేది కాదు. ప్రతిఎన్నికకు ఎవరినో ఇన్‌చార్జిగా పెట్టడం ఆనవాయితీ అని ఆయన జవాబివ్వడంలోనే కెటిఆర్‌కు ఏ ప్రత్యేకత లేదని చెప్పినట్టయింది. ఎవరినో లాంచనంగా నియమించడానికి కెటిఆర్‌కు బాధ్యతలు అప్పగించడానికి తేడా వుంది. ఈ నేపథ్యంలోనే తుమ్మల వారసత్వ రాజకీయాలపై అసమ్మతి వ్యక్తం చేయడం ఆసక్తి రేపింది.

కెసిఆర్‌ నాయకత్వంలో నడుస్తాం గాని వారసత్వ రాజకీయాలను బలపర్చబోనని ఆయన టివి9 ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. కెటిఆర్‌ను కూడానా…? అని మురళీకృష్ణ మరోసారి అడిగినప్పుడు నా వారసత్వాన్నే నేను బలపర్చనప్పుడు మరెవరినో ఎలా సపోర్టు చేస్తాను? అని ఎదురు ప్రశ్న వేశారు. సోషల్‌ మీడియాలోనూ పత్రికల్లోనూ వచ్చిన ఈ వ్యాఖ్య అందరి దృష్టినీ ఇంకా ఆకర్షించినట్టు లేదు. పైగా ఏదో సవరణో వివరణో ఎలాగూ వుంటుంది.

అయితే టిఆర్‌ఎస్‌లో ఈ వ్యాఖ్య ఎవరూ వూహించంది. తన అంతర్గత వ్యూహాలకు బాగా ఉపయోగపడతారనే కెసిఆర్‌ తుమ్మల, తలసాని వంటివారిని తెచ్చుకున్నారని భావించారు. నిజానికి ఈ విషయంలో మిగిలిన వారికంటే ఇరకాటంగా వున్నది హరీష్‌కే అయినా రాజకీయ భవిష్యత్తు రీత్యా మౌనం పాటిస్తున్నారు. అనేక సంకటాలు దిగమింగుతున్నారని అనుయాయులు చెబుతుంటారు. తుమ్మలకు అంత సమస్య లేదు గనక పైకే అనేశారు. మరి అధినేత దీన్ని ఎలా తీసుకుంటారో…ఎలా కవర్‌ చేస్తారో చూడాలి. వారసత్వాలు కొత్త కాకున్నా అవసరాన్ని మించి పుత్రవాత్సల్యం ప్రదర్శించిన కెసిఆర్‌ కోరి సమస్యలు తెచ్చుకుంటున్నారనే భావం పార్టీలో వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com