తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యవహారశైలి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హిందూ ధర్మం, బ్రాహ్మణులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెంచుతున్నాయి. మందుల సామేల్ గతంలో కూడా లంచాలు నేరుగా ఇంటికే తెచ్చి ఇవ్వాలి అని బహిరంగంగా హెచ్చరిస్తూ కెమెరాలకు చిక్కడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అవినీతిని ప్రోత్సహించేలా మాట్లాడటంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.
ఇప్పుడు దానికి తోడు, గాంధీ భవన్ వంటి పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే బ్రాహ్మణ పురోహితులను, వేద మంత్రాలను హేళన చేయడం ఆ వ్యతిరేకతను పరాకాష్టకు తీసుకెళ్లింది. ఈ ఘటనతో ఆగ్రహించిన హిందూ సంఘాలు, బ్రాహ్మణ సమాజం ఆయన నివాసంపై కోడిగుడ్లతో దాడి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. హిందూ మనోభావాలను గాయపరిచేలా సామేల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాంగ్రెస్‌కు పెద్ద మైనస్‌గా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బీజేపీ వంటి పార్టీలు దీనిని అస్త్రంగా చేసుకుని, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆందోళనలు చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేయడానికి బయట శత్రువులు అవసరం లేదు, ఇలాంటి ఎమ్మెల్యేలు ఒక్కరు చాలు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. సామేల్ వైఖరి వల్ల తటస్థ ఓటర్లు, హిందూ సామాజిక వర్గాలు పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉందన్న ఆందోళన పార్టీలో వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లేదా ప్రభుత్వం తరపున గట్టి చర్యలు తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది. కేవలం వివరణ కోరతామని చెప్పడానికే పరిమితం కావడం వల్ల, పార్టీ ఇలాంటి చర్యలను వెనకేసుకొస్తుందనే సంకేతాలు వెళ్తున్నాయి.
మందుల సామేలుతో వివరణ ఇప్పించినా ప్రయోజనం ఉండదు. ఇక నుంచి ఆయనా ఆయనకు మాటలు పొదుపుగా మాట్లాడాలని ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.


