కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత టీవీకే విజయ్ మొదటి సారి పరిమితమైన కార్యకర్తలతో ప్రచార సభ నిర్వహించారు. కాంచీపురం జిల్లాలో ఓ కాలేజీ మైదానంలో జరిగిన సమావేశంలో విజయ్ ప్రసంగించారు. ఇది బహిరంగసభ కాదు. కానీ మూడు మండలాల నుంచి రెండు వేల మందిని ప్రత్యేకంగా పాసులు ఇచ్చి ఆహ్వానించారు. పోలీసులు భద్రతా కారణాలతో 2,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. మీడియా, సామాన్య ప్రజలకు ఎంట్రీ అవకాశం ఇవ్వలేదు. దీంతో పరిమిత సంఖ్యలో వచ్చిన పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.
మద్రాస్ హైకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ సమావేశాలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించమని ఆదేశించింది. దీంతో పోలీసులు భద్రతా ఆంక్షలు విధించారు. డిసెంబర్ 4న సేలంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. భవిష్యత్ కార్యక్రమాలకు 4 వారాల ముందుగా అనుమతి తప్పనిసరి అని పోలీసులు సూచించారు. కరూర్ ఘటన కారణంగా తన ప్రచారంపై పూర్తి స్థాయి ఆంక్షలు విధించే అవకాశం ఉండటంతో.. ‘మీట్ ది పీపుల్’ క్యాంపెయిన్ పేరుతో ఇలాంటి సభలు నిర్వహిస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి ఖాయమని కార్యకర్తలకు విజయ్ భరోసా ఇచ్చారు. డీఎంకే మనకు రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని పొత్తులకు అవకాశం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రజలందరికీ సొంతిళ్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే లక్ష్యం అని ఎన్నికల హామీల్లో ఒకదాన్ని లీక్ చేశారు. మెల్లగా ప్రజల్లోకి వెళ్లాలని .. జోరు పెంచాలని విజయ్ భావిస్తున్నారు.