తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ వ్యూహాలు చర్చనీయాంశం అవుతున్నాయి. అదే సమయంలో రాజకీయాల్లో అనుభవం లేని ఆయన నిర్ణయాలు కూడా గందరగోళానికి కారణం అవుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. డీఎంకే, బీజేపీలతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని విజయ్ ఇటీవల ప్రకటించారు. తమ పార్టీ తరపున తానే సీఎం అభ్యర్థి అని కూడా స్పష్టత ఇచ్చారు.
అయితే ఆయన అసలు పూర్తిగా పొత్తులు ఉండవని చెప్పలేదు. డీఎంకే, బీజేపీతో మాత్రమే పొత్తులు ఉండదన్నారు. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే కొన్ని ఆప్షన్స్ ఉంచుకున్నారని అంటున్నారు. అందులో మొదటిది అన్నా డీఎంకే. అన్నాడీఎంకే, విజయ్ పార్టీ పొత్తులు పెట్టుకుంటే అదో మంచి కాంబినేషన్ అవుతుందని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు అంచనా వేశారు. కానీ అన్నాడీఎంకే బీజేపీ దగ్గరకు చేరింది. ఇప్పుడు బీజేపీ ఉన్న కూటమిలో విజయ్ చేరలేడు.
ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆయన ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పొత్తుల కోసమే అని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమిలో ఉంది. వారి పొత్తులు రాష్ట్ర స్థాయిలో కాదు.. జాతీయ స్థాయిలో చాలా అవసరం. స్టాలిన్ ఇచ్చే గౌరవాన్ని పుచ్చుకుని ఆ పార్టీ కూటమిలో కొనసాగడం తప్ప కాంగ్రెస్ పార్టీకి మరో ఆప్షన్ లేదు. విజయ్ కోసం స్టాలిన్ ను వదిలి పెట్టేంత సాహసం చేయరు. అలాగే డీఎంకే ఉన్న కూటమిలోకి టీవీకే చేరలేదు. అంటే విజయ్ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదు.
తమిళనాడు రాజకీయాల్లో ఒంటరి పోటీ అనేది ఏ మాత్రం సక్సెస్ కాని ఫార్ములా. జయలలిత అయినా చిన్న పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసేవారు. కరుణానిధి అయినా అంతే. స్టాలిన్ అయినా అంతే. కానీ విజయ్ కు మాత్రం.. తన రాజకీయ విధానాల కారణంగా.. కలసి వస్తాయనుకున్న ఇతర పార్టీలు ఇతర కూటముల్లో ఉండిపోవడం వల్ల ఒంటరిగా ఉండాల్సి వస్తోంది. విజయ్ రాజీ పడితేనే పొత్తులుఉంటాయి. లేకపోతే ఒంటరి పోటీ అనుకోవచ్చు.