తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి, తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉదయమే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. నేరుగా సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. సీబీఐ అధికారుల ఆయన స్టేట్మెంట్ నమోదు చేసి పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది.
2025 సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారణ నిష్పక్షపాతంగా జరగదని సీబీఐ విచారణ జరగాలని సుప్రీంకోర్టును విజయ్ ఆశ్రయించారు. ఆ మేరకు సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించడడంతో సీబీఐ ఈ కేసును స్వీకరించి లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఈ విచారణలో భాగంగా, సభకు అనుమతులు పొందడం, జన సమూహాన్ని నియంత్రించేందుకు తీసుకున్న భద్రతా చర్యలు , పార్టీ నిర్వాహకుల బాధ్యతలపై విజయ్ను అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు టీవీకే నాయకులను విచారించిన సీబీఐ, విజయ్ వాంగ్మూలాన్ని నమోదు చేయడం ఈ కేసులో కీలక దశగా భావిస్తున్నారు.
మరోవైపు, విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్ విడుదలపై ఇంకా క్లారిటీరాలేదు. చిత్రంలోని కొన్ని రాజకీయ సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరాల కారణంగా సెన్సార్ సర్టిఫికేట్ జాప్యం కావడంతో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఢిల్లీలో బస చేస్తే లేనిపోని రాజకీయ ఊహాగానాలు వస్తాయని విజయ్ వెంటనే తిరుగు పయనమయ్యే అవకాశాలు ఉన్నాయి.
