కరూర్ తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయిన విజయ్ మూడు రోజుల తర్వాత ఓ వీడియో విడుదల చేసి తన వాదన వినిపించారు.అక్కడేం జరిగిందో ప్రజలు చెబుతున్నారని.. త్వరలో నిజాలు బయటకు వస్తాయన్నారు. అదే సమయంలో సీఎం సార్ అంటూ స్టాలిన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తననపై ప్రతీకారం, కక్ష తీర్చుకోవాలంటే తాను ఇంట్లో లేదా పార్టీ ఆఫీసులో ఉంటానని.. కానీ తన కార్యకర్తల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. మా తప్పు లేకపోయినా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారని విజయ్ అంటున్నారు.
ఈ ఘటనపై తనపై వస్తున్న విమర్శలన్నింటికీ వీడియోలో విజయ్ సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. తాను ఘటనా ప్రదేశం నుంచి వెళ్లిపోవడానికి కారణం .. ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండటానికేనని .. తానూ మనిషినేనని విజయ్ చెప్పుకొచ్చారు. త్వరలో అందర్నీ పరామర్శిస్తానన్నారు. తానేమీ చిన్న ఇరుకు సందులో సభ పెట్టలేదని.. అన్ని జాగ్రత్తలు తీసుకుని పూర్తి స్థాయిలో పోలీసుల అనుమతి తీసుకునే సభను పెట్టామని వివరణ ఇచ్చారు.
అదే సమయంలో ఇది కుట్ర అని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు. ఇప్పటి వరకూ ఐదు జిల్లాల్లో ప్రచారసభలు నిర్వహించానని ఎక్కడా ఇలాంటివి జరగలేదన్నారు. కరూర్ లో మాత్రమే ఎందుకు జరిగిందో ప్రజలు ఊహించవచ్చన్నారు. తమ వైపు నిలిచిన వారికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విజయ్ కు మద్దతుగా నిలిచారు. కరూర్ ఘటనపై ప్రజల్ని రెచ్చగొట్టేలా తప్పుడు వార్తల్ని ప్రసారం చేస్తున్న యూట్యూబర్లపైనా కేసులు పెడుతున్నారు. దీన్ని కూడా విజయ్ ఖండించారు.
ఈ వీడియో ప్రకటన ద్వారా విజయ్.. ఆ ఘోర విషదాన్ని ఇతరులపై నెట్టేసే ప్రయత్నం చేసినట్లుగా స్పష్టమవుతోంది.కానీ ఆయన తన పై వస్తున్న విమర్శలకు బలమైన సమాధానం మాత్రం ఇవ్వలేకపోయారని భావిస్తున్నారు.