గోటితో పోయేది గొడ్డలిదాకా వస్తే ఇలాగే ఉంటుందేమో. చిన్న విషయం చినికి చినికి గాలివానై తెలంగాణ ఆర్టీసీకి భారీగా నష్టం కలిగించింది. 2 రూపాయల వివాదం కాస్తా సంస్థకు 2 కోట్ల రూపాయల నష్టానికి దారి తీసింది. ఉఫ్పల్ డిపోలో జరిగిన ఒక సంఘటన పర్యవసానమిది.
ఇటీవల ఉప్పల్ డిపోకు చెందిన బస్సు ఎక్కిన ఓ ప్రయాణికురాలు, ఆ తర్వాత అధికారులకు ఫిర్యాదు చేసింది. మహిళా కండక్టర్ ను తనకు ఇవ్వాల్సిన రెండు రూపాయల గురించి అడిగితే చేయి చేసుకుందని ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు, కండక్టర్ తప్పుందని తేల్చారు. వేరే డిపోకి బదిలీ చేశారు. దీంతో కార్మిక సంఘాలు మండిపడ్డాయి.
సదరు కండక్టర్ ను ఉప్పల్ డిపోలోనే కొనసాగించాలని యూనియన్లుడిమాండ్ చేశాయి. కానీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో సమ్మె మొదలైంది. అది కాస్తా ఇతర డిపోలకూ విస్తరించింది. చివరకు వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇది గమనించిన ఉన్నతాధికారులు, ఇక లాభం లేదనుకున్నారు. ఆ మహిళా కండక్టర్ ను పాత చోటికే బదిలీ చేశారు. ఆందోళన విరమించండని యూనియన్లను కోరారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.
కార్మికుల ఆందోళన, సమ్మె వల్ల సంస్థ 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. దీనికి బాధ్యులు మీరంటే మీరేనని అధికారులు, యూనియన్ నేతలు నిందించుకుంటున్నారు. ఏమైతేనేం, ఆందోళన వల్ల ఇబ్బంది పడింది ప్రయాణికులు. ఆదాయాన్ని నష్టపోయింది ఆర్టీసీ.
