తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి గురువారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. గతంలో బీఆర్ఎస్తో స్నేహంగా ఉన్న మజ్లిస్, ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నికల బరిలో నిలబడలేదు. తొలుత అభ్యర్థిని పోటీకి దించేందుకు కసరత్తు చేస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ, చివర నిమిషంలో వెనక్కి తగ్గింది. అసెంబ్లీలో తమకు ఉన్న ఎమ్మెల్యేల బలం సరిపోదని నిర్ణయించుకున్నారు. పోటీ చేసి ఓటింగ్ జరిగేలా చేసి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో విప్ పని చేయదని సుప్రీంకోర్టు తీర్పులు ఉండటంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం బరిలో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీనివల్ల రాజ్యసభలో కాంగ్రెస్ బలం పెరగడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి నాయకత్వానికి హైకమాండ్ ఇచ్చిన ప్రాధాన్యత స్పష్టమైనట్లు అయింది.


