మారుతున్న తెలుగు టీవీ మీడియా మౌలిక స్వరూపం..!

మారుతున్న కాలంతో పాటు దూసుకొచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా.. మెల్లగా.. వ్యాపారుల చేతుల్లోకి చేరిపోయింది. తొలి తరం చానళ్లు సహా.. కొత్తగా పుట్టిన చానళ్లు కూడా… రియల్ ఎస్టేట్ సహా ఇతర రంగాల్లో వేల కోట్లకు పడగలెత్తిన వారి చేతుల్లో కీలబొమ్మలుగా మారే పరిస్థితి వచ్చింది. జర్నలిజంలో పుట్టి.. పెరిగి.. ఓ వ్యవస్థగా చానళ్లను మార్చిన తర్వాత వాటి నుంచి జర్నలిస్టులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక నిఖార్సైన జర్నలిజానికి తెలుగు రాష్ట్రల్లో అర్థం మారబోతోంది.

తెలుగు టీవీ రంగంపై బడా వ్యాపారుల కన్ను..!

మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్ రావు, మేఘా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి… వ్యాపారాలు వేల కోట్లతో ముడిపడి ఉంటాయి. సిమెంట్ కంపెనీలు, కాంట్రాక్టులు, భారీ ప్రాజెక్టులు, వేల కోట్ల విలువ చేసే హౌసింగ్ ప్రాజెక్టులు వీరి దగ్గర ఉంటాయి. ఆ వ్యవహారాలతో తీరిక లేకుండా ఉండే వారికి.,.. అసలు ఏ మాత్రం సంబంధం లేని మీడియా రంగంలోకి ఎంటరయ్యారు. తమ వ్యాపారాలతో పోలిస్తే పీపీలికం లాంటి.. అసలు లాభాలు రావడమే గగనం లాంటి.. మీడియా రంగంలోకి వందల కోట్లు కుమ్మరించి ప్రవేశించారు. ఇది కూడా.. ఓ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. మొదట.. కమ్యూనిస్టుల చేతుల్లోని టెన్ టీవీ టేకోవర్ చేశారు. ఆ తర్వాత ఏకంగా టీవీ నైన్ పైనే గురి పెట్టారు. త్వరలో మరి కొన్ని చానళ్లపైనా గురి పెడతారని ప్రచారం జరుగుతోంది.

నిఖార్సైన జర్నలిజాన్ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు..?

మైహోం, మేఘా కంపెనీల అధినేతలు మొదట టెన్ టీవీని కొనుగోలు చేశారు. అసలు ఆ టెన్ టీవీని అమ్మడానికి… కమ్యూనిస్టులకు.. కొనడానికి..ఈ బడా పారిశ్రామికవేత్తలకు హక్కే లేదు. టెన్ టీవీని క్రౌడ్ పండింగ్ ద్వారా పెట్టారు. లక్షల్లో షేర్లు కొనుగోలు చేసిన వారున్నారు. వారెవరికీ.. అమ్మకం తెలియదు. అమ్మినందుకు.. ఎవరికీ ప్రతిఫలం దక్కలేదు కూడా. ఆ వివాదం అలా ఉండగానే.. టీవీ 9ని కూడా అలాగే కొనుగోలు చేశారు. మైనార్టీ షేర్ హోల్డర్లంటే.. అమాయకులు.. వారికి పైసా ఇవ్వాల్సిన పని లేదన్నట్లుగా.. వ్యవహారాన్ని నడిపించారు. ఇన్ని అక్రమాలతో.. టీవీ చానళ్లను కొనుగోలు చేసి.. వాటిని నిజాయితీగా నడుపుతారని ఎవరు అనుకుంటారు.

మిగతా టీవీ చానళ్లు అలాగే….!

జర్నలిస్టులు స్వతహాగా ప్రారంభించిన టీవీ చానళ్లే నిలదొక్కుకున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ప్రారంభించిన ఏ టీవీ కూడా నిలదొక్కుకోలేదు. స్టూడియో ఎన్, ఎక్స్ ప్రెస్ టీవీ సహా.. అనేక టీవీ చానళ్లు దీనికి ఉదాహరణగా ఉన్నాయి. అలా నిలబడం లేదు కాబట్టే.. జర్నలిస్టులు ప్రారంభించిన టీవీ చానళ్లను .. బాగా ఎదిగిన తర్వాత ఎక్వైర్ చేయడం అనే పద్దతిని వ్యాపారాలు ప్రారంభించారు. ఇప్పుడు… ఆ చానళ్లలో ఇప్పటి వరకూ ఉన్న సహజసిద్ధ జర్నలిజాన్ని కోల్పోవడం ఖాయం. తాము చూపించిందే జర్నలిజం అనుకునే పరిస్థితులు వస్తాయి. ప్రజలు చూస్తారా.. లేదా.. అన్న సంగతి తర్వాత.. కానీ.. అసలు జర్నలిజం మాత్రం.. మౌలిక రూపం మార్చుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com