భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు మెట్రో నగరాల కంటే టైర్-2 నగరాలే హాట్ టాపిక్‌గా మారాయి. 2026లో జైపూర్, మొహాలీ, చండీగఢ్, విశాఖ, వరంగల్ వంటి నగరాలు మౌలిక సదుపాయాల మెరుగుదల కారణంగా పెట్టుబడిదారులకు స్వర్గధామాలుగా మారుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మెట్రో నగరాల్లో స్థలాల కొరత, విపరీతమైన ధరలు కొనుగోలుదారులను ఈ చిన్న నగరాల వైపు మళ్ళిస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ సంస్కృతి , మెరుగైన కనెక్టివిటీ ఈ వృద్ధికి ప్రధాన ఇంజన్లుగా పనిచేస్తున్నాయి.
రింగ్ రోడ్ ప్రాజెక్టులు , అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రభుత్వం చేపడుతున్న ‘స్మార్ట్ సిటీ’ మిషన్ ద్వారా ఈ నగరాల్లో రోడ్లు, డ్రైనేజీ ,విద్యుత్ సౌకర్యాలు మెట్రోల స్థాయికి చేరుతుండటం కొనుగోలుదారుల నమ్మకాన్ని పెంచుతోంది. మెట్రోతో పోలిస్తే టైర్-2 నగరాల్లో ఇంకా వృద్ధికి చాలా అవకాశం ఉంది. 2026లో ఈ నగరాల్లో ఆస్తి విలువలు 12% నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లు లభించడమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే లాభాలు కూడా మెట్రోల కంటే ఇక్కడే ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలే కాకుండా ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులు కూడా టైర్ 2 నగరాల వైపు చూస్తున్నారు. కాలుష్యం తక్కువగా ఉండటం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోవడం , నాణ్యమైన విద్యా, వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ప్రజలు ఈ నగరాల్లో స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారు. 2026 నాటికి ఈ ధోరణి మరింత పెరిగి, భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో టైర్-2 నగరాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
