పార్టీని పట్టాలెక్కించాలని ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ బీఆర్ఎస్ విచ్చిన్న సభలా మారిందా? ఆ సభ తర్వాతే బీఆర్ఎస్ లో ముసలం మొదలైందా? పార్టీలో తాను కొనసాగితే తనకేంటి అని ట్రబుల్ షూటర్ లెక్కలు వేసుకునే స్టేజ్ కు వెళ్లారా? బావ అడుగులను గమనించిన కేటీఆర్.. ఆయనతో సంధి చేసుకోకపోతే బీఆర్ఎస్ ఫ్యూచర్ కష్టం అవుతుందని రాజీ రాజకీయం ప్రారంభించారా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇదే.
బీఆర్ఎస్ లో ప్రస్తుతం మూడు ముక్కలాట నడుస్తోంది. ఎవరికీ వారుగా రాజకీయం చేస్తున్నారు. కవిత సొంత ఎజెండాతో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆమె అవసరమైతే పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు. హరీష్ రావు కూడా పార్టీలో ప్రాధాన్యత లేదని అసంతృప్తిగా ఉన్నారు. కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌజ్ కు పరిమితం కావడంతో బీఆర్ఎస్ కు సర్వం తనే అన్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. హరీష్ రావు ఎక్స్ పోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా కేటీఆర్ పూర్తిగా డామినేట్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ హరీష్ ను కాదని గతానికి భిన్నంగా కేటీఆర్ లీడ్ తీసుకున్నారు.
కేటీఆర్ అడుగులతో కవిత ముందే సర్దుకుంటున్నారని ఓ ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు హరీష్ కూడా దాదాపు అలాంటి సిగ్నల్స్ ఇవ్వడంతో కేటీఆర్ ఉలిక్కిపడ్డారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనేది హరీష్ వాంఛగా తెలుస్తోంది. కేసీఆర్ ఎలాగూ అసెంబ్లీకి హాజరు కావడం లేదు..పైగా కాంగ్రెస్ ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తోంది. దీంతో తనకు ఎల్వోపీ ఇస్తే రేవంత్ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతోపాటు తనకు ప్రాధాన్యత దక్కుతుందనేది హరీష్ వ్యూహంగా కనబడుతోంది. అదే సమయంలో హరీష్ కు బీఆర్ఎస్ లోని మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతోపాటు..ఎల్వోపీ ఇవ్వడమంటే పార్టీ మొత్తాన్ని ఆయన చేతుల్లో పెట్టడమే. అందుకే భవిష్యత్ పరిణామాలను అంచనా వేసి కేటీఆర్ అందుకు సుముఖంగా లేరని ప్రచారం జరుగుతోంది.
హరీష్ రావుకు ప్రతిపక్ష నేత హోదాకు అంగీకరిస్తే బీజేపీతో చేతులు కలిపి.. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేస్తాడని భయం కూడా కేటీఆర్ వెంటాడుతుందని అంటున్నారు. అందుకే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో హరీష్ రావుతో సంధి కుడుర్చుకోవడమే ఉత్తమమని భావించి ఇటీవల హరీష్ నివాసానికి కేటీఆర్ వెళ్లారని ప్రచారం జరిగింది. అయితే, కేటీఆర్ విజ్ఞప్తిని మన్నిస్తే తనకు రాజకీయ చరిష్మా మసకబారుతుంది అనేది హరీష్ ఆందోళనగా తెలుస్తోంది. భవిష్యత్ బీఆర్ఎస్ దేనని రాజీపడితే..కేటీఆర్ ను కాదని తనకు కీలక బాధ్యతలు కేసీఆర్ అప్పగిస్తారా? అని హరీష్ లెక్కలు వేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది