జగన్ రెడ్డి నిర్ణయాలపై శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి ఆశ్చర్యపోయారు. తనను ఓడించిన కూటమి అభ్యర్థికి జగన్ ఎందుకు మద్దతు తెలుపుతున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. మోడీ, అమిత్షా ఉన్న ఉపరాష్ట్రపతిని పారిపోయేలా చేశారు.. ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తే ఆర్ఎస్ఎస్ భావజాలం అంగీకరించినట్లేనని ఆయన అన్నారు. అసలు ఉండవల్లికి వచ్చిన ఆలోచన అందరికీ వచ్చింది. ఎన్డీఏ చేతిలో ఓడిపోయిన జగన్.. ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న వైసీపీ నేతలకు రాలేదని ఉండవల్లి అనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదేమో ?
ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో జగన్మోహన్ రెడ్డిని .. బీజేపీపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. జైలుకు పంపిస్తారని భయం ఉంటే..ఇప్పటికే పదహారు నెలలు ఉన్నారు.. అయినా సీఎం అయ్యారు..మరోసారి జైలుకు పంపిస్తే మరోసారి సీఎం అవుతారు..అంత దానికి భయపడటం ఎందుకని …పర్సనాలిటీ డెలవప్మెంట్ క్లాస్ కూడా మీడియా ముఖంగా తీసుకున్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం ధైర్యం చేయలేకపోయారు. బీజేపీని ధిక్కరిస్తే తన బతుకు రాజస్థాన్ ఎడారి అయిపోతుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం కన్నా.. బీజేపీకి లొంగిపోయి ఉండటం మంచిదని అనుకుంటున్నారు.
జగన్ రెడ్డి మైండ్ సెట్ గురించి తెలిసి కూడా.. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలా ప్రెస్మీట్లు పెట్టి ఎందుకు ఆశ్చర్యపోతారో కానీ.. వైసీపీ నేతలకు మాత్రం ఆయనపై కోపం వస్తోంది. జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడితే బాగానే ఉంటుందని కానీ..ఇలా మాట్లాడటం మంచిది కాదని అంటున్నారు. అయినా ఉండవల్లి జగన్ మంచి కోసం సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోరు.