జగన్ హయాంలో ఉద్యోగుల అవినీతి పెరిగిపోయిందంటున్న ఉండవల్లి..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ మేరకు.. అధికారం చేపట్టిన తరవాత ఉద్యోగులకు.. . సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అవినీతి ఉండకూడదని.. ఓ కాల్ సెంటర్ కూడా ప్రారంభించారు. ఇంతా చేసిన తరవాత అవినీతి తగ్గిపోయిందా.. అంటే.. లేనే లేదంటున్నారు.. ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ.. మరింత పెరిగిందంటున్నారు. దానికి కూడా కారణం ఆయనే చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్ గా ఉండమన్నారని చెప్పి… రూ. యాభైవేలు లంచం తీసుకునే దగ్గర ఇప్పుడు రూ. లక్ష వసూలు చేస్తున్నారట. అంటే.. రిస్క్ ఫీజు డబుల్ చేసి.. వసూలు చేస్తున్నారన్నమాట. దీనికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు రకాల ఉదాహరణలు కూడా చెప్పారు. గతంలోలా లేదని… అధికారులు.. సామాన్యులను వేధిస్తున్నారట.

ఉండవల్లి అరుణ్ కుమార్… ప్రతిపక్ష నేత కాదు. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుత ప్రభుత్వానికి శ్రేయోభిలాషినే. ఆయన రాజకీయ కోణంలో ఆరోపణలు చేయలేదు. ఆయన దృష్టికి వచ్చిన వాటిని తనదైన శైలిలో మీడియా ముందు ఉంచారు. ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న అంశాలో.. అధికారుల వ్యవహరిస్తున్న తీరుపై… తీవ్ర విమర్శలు వస్తున్న సమయంలో.. ఉండవల్లి వ్యాఖ్యలు.. హైలెట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇసుక విషయంలో.. ఉండవల్లి అధికారుల అవినీతిని నేరుగానే బయట పెట్టారు. గోదావరి ఒడ్డున ఉన్న రాజమండ్రిలోనే ఇసుక దొరకడం లేదంటున్నారు. దానికి అధికారుల అవినీతే కారణమని చెబుతున్నారు. ఇతర పౌరసంబంధిత అంశాల్లోనూ.. అవినీతి రెండింతలు అయిందంటున్నారు.

ప్రభుత్వ ఆర్థిక విధానాలపైనా… ఉండవల్లి తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకు కట్టాల్సిన డబ్బును.. మద్యం బకాయిలకు.. ఆరోగ్యశ్రీ బకాయిలకు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. అసలు.. అలా చెల్లించడం చట్ట విరుద్దమన్నారు. గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన పోలవరం సొమ్మును.. కొద్ది రోజుల కిందట.. కేంద్రం రీఎంబర్స్ చేసింది. పోలవరం కాంట్రాక్టర్లకు మాత్రంమ చెల్లింపులు లేదు. గతంలో పని చేసిన జర్మనీ సంస్థ… తమకు కావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదంటూ… కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం కలకలం రేపింది. ప్రభుత్వ విధానాలతో.. రాష్ట్రం ఏమయిపోతుందోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ఉండవల్లి.. లాజిక్‌లతో ఉన్నా.. మొహమాటం లేకుండా .. ఉన్న విషయాలను నిర్మోహమాటంగా చెప్పేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com