ప‌వ‌న్ సినిమా.. బ్లూ మేట్ల మ‌యం

చారిత్ర‌క నేప‌థ్యంలో సినిమాలు తీయ‌డం అంటే మాట‌లు కాదు. ఆ వాతావ‌రణాన్ని తెర‌పై ప్ర‌తిబింబించేలా చేయ‌గ‌ల‌గాలి. అప్ప‌టి వ‌స్తువులు, క‌ట్ట‌డాలు పునఃసృష్టి చేయాలి. దానికి ఎంతెంతో క‌స‌రత్తు జ‌ర‌గాలి. అయితే ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం మూలంగా ఆ శ్ర‌మ కొంత వ‌ర‌కూ త‌ప్పుతోంది. సెట్లు వేయాల్సిన శ్ర‌మ‌, క‌ష్టం నుంచి బ్లూ మేట్స్ ఉప‌శమ‌నం క‌లిగించాయి. బ్లూమాట్స్‌తో ఎన్ని అద్భుతాలు సృష్టించొచ్చో…. హాలీవుడ్ సినిమాల ద్వారా అర్థ‌మైంది. రాజ‌మౌళి కూడా త‌న సినిమాల్లో బ్లూ మాట్స్‌ని ఎక్కువ‌గా న‌మ్ముకుంటాడు. నీలి రంగు తెర‌ల్ని వెనుక ఉంచి స‌న్నివేశాల్ని తెర‌కెక్కించేసి, ఆ త‌ర‌వాత‌.. కావల్సిన క‌ట్ట‌డాల్ని వెనుక చూపించుకునే అవ‌కాశం బ్లూమాట్స్ క‌ల్పిస్తున్నాయి. అయితే.. నూటికి నూరు శాతం సన్నివేశాల్ని బ్లూ మాట్స్‌లోనే తీయ‌డానికి వీలు కాదు. ఎంతో కొంత ఆర్ట్ వ‌ర్క్ జ‌ర‌గాలి. దాని చుట్టూ బ్లూ మాట్స్ వేసుకుంటూ వెళ్తే.. ప‌ని సుల‌భం అవుతుంది. క్రిష్ సినిమాలో మాత్రం ఎక్క‌డిక‌క్క‌డ బ్లూమాట్స్ ద‌ర్శ‌న మిస్తున్నాయ‌ని తెలుస్తోంది.

ఆయ‌న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఇది చారిత్ర‌క నేప‌థ్యంలో సాగే సినిమా. అందుకోసం చాలా సెట్లు అవ‌స‌రం అవుతున్నాయి. అయితే క్రిష్ మాత్రం బ్లూమాట్స్‌ని న‌మ్ముకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో షూటింగ్ జ‌రుగుతోంది. అక్క‌డ బ్లూ మాట్స్‌వేసి.. స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. సెట్స్ చాలా త‌క్కువ వాడుకుంటూ… బ్లూమాట్స్‌పై ఆధార‌ప‌డుతూ షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

త‌క్కువ స‌మ‌యంలో ఈ సినిమాని పూర్తి చేయాల‌ని క్రిష్ ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. సెట్స్ నిర్మాణానికి టైమ్ లేదు. అందుకే బ్లూమాట్స్ వైపు దృష్టి నిలిపాడు. అయితే… ఎక్క‌డా కృత్రిమత్వం లేకుండా.. టెక్నిక‌ల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేలా క్రిష్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చారిత్ర‌క చిత్ర‌మే. ఆ సినిమాని చాలా ప‌క‌డ్బందీగా తీయ‌గ‌లిగాడు క్రిష్‌. ఈసారి మ‌రింత బ‌డ్జెట్ త‌న చేతిలో ఉంది. అందుకే.. నాణ్య‌త విష‌యంలో తాను రాజీ ప‌డ‌డం లేదు. కొన్ని సన్నివేశాలు, షాట్స్ హాలీవుడ్ చిత్రాల్ని మ‌రిపించేలా ఉంటాయ‌ని తెలుస్తోంది. కాక‌పోతే సెట్స్ కోసం ఎక్కువ డ‌బ్బులు వృధా చేయ‌ల‌ద‌ల‌చుకోలేదంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com