కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా చర్చ మొదలైన వేళ, రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం నుంచి భారీ ఊరటను ఆశిస్తోంది. ముఖ్యంగా క్రెడాయ్ వంటి అగ్రశ్రేణి సంస్థలు మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల కొనుగోలును సులభతరం చేసే దిశగా కీలక ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాయి. నేషనల్ రెంటల్ హౌసింగ్ మిషన్ ను ప్రారంభించాలని క్రెడాయ్ గట్టిగా కోరుతోంది. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల అద్దె ఇళ్ల డిమాండ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ఈ రంగాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా డెవలపర్లకు ప్రోత్సాహకాలు, అద్దెదారులకు పన్ను రాయితీలు కల్పించాలని సూచించింది. ఇది పట్టణ ప్రాంతాల్లో అక్రమ స్థిరనివాసాలను తగ్గించి, వ్యవస్థీకృత అద్దె మార్కెట్‌ను బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హోమ్ లోన్ వడ్డీ రాయితీపై కన్ను
మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చేలా, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24(b) కింద హోమ్ లోన్ వడ్డీ రాయితీ పరిమితిని ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని రియల్టీ రంగం కోరుతోంది. గత దశాబ్ద కాలంగా ప్రాపర్టీ ధరలు, వడ్డీ రేట్లు భారీగా పెరిగినప్పటికీ, ఈ పరిమితి పెరగకపోవడం వల్ల సామాన్యులపై భారం పడుతోంది. ఈ సవరణ జరిగితే గృహ కొనుగోలుదారుల చేతిలో నగదు లభ్యత పెరిగి, రియల్ ఎస్టేట్ అమ్మకాలు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది.
అఫర్డబుల్ హౌసింగ్ కు కొత్త నిర్వచనం
మరో ప్రధాన డిమాండ్ అందుబాటు ఇళ్ల ధర పరిమితిని సవరించడం. ప్రస్తుతం మెట్రో నగరాల్లో కూడా రూ.45 లక్షల లోపు ఉన్న ఇళ్లను మాత్రమే ఈ కేటగిరీలో చేరుస్తున్నారు. కానీ, పెరిగిన భూమి ధరలు, నిర్మాణ వ్యయం దృష్ట్యా ఈ పరిమితిని రూ.90 లక్షల వరకు పెంచాలని క్రెడాయ్ కోరుతోంది. దీనివల్ల ఎక్కువ మంది కొనుగోలుదారులు 1శాతం తక్కువ జీఎస్టీ , ఇతర ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలను పొందే వీలుంటుంది.
పరిశ్రమ హోదా – సింగిల్ విండో క్లియరెన్స్
రియల్ ఎస్టేట్ రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలనేది దశాబ్దాల కాలంగా ఉన్న డిమాండ్. దీనివల్ల డెవలపర్లకు తక్కువ వడ్డీకే బ్యాంకుల నుండి నిధులు లభిస్తాయి. వీటితో పాటు ప్రాజెక్టుల ఆమోదం కోసం సింగిల్ విండో క్లియరెన్స్ పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా కాలయాపనను తగ్గించి, గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని పారిశ్రామికవేత్తలు ఆశిస్తున్నారు.
