రోహిత్ కి న్యాయం కోరుతూ విద్యార్ధులు ‘చలో డిల్లీ’

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య చేసుకొన్న తరువాత విద్యార్ధులకు సంఘీభావం ప్రకటించడానికి దేశంలో ఎక్కెడెక్కడి రాజకీయ నాయకులో యూనివర్సిటీకి తరలివచ్చి హడావుడి చేసి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి వారితో కలిసి నిరాహార దీక్షలో కూడా పాల్గొన్నారు. ఆ తరువాత నేతలందరూ ఎవరి కార్యక్రమాలలో వారు బిజీ అయిపోయారు. ఈ సంఘటన సరిగ్గా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు ముందు జరుగడంతో రాజకీయ పార్టీలన్నీ ఆ హడావుడిలో పడిపోయాయి. ఇప్పుడు ఆందోళన చేస్తున్న విద్యార్ధులవైపు కన్నెత్తి చూసేవారు లేరు. ఈ పరిణామాలన్నీ ముందు ఊహించినవే.

రోహిత్ మరణానికి కారకులయిన కేంద్రమంత్రులు-బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలను, యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ అప్పారావుని వారి పదవులలో నుంచి తప్పించి వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని విద్యార్ధులు కోరుతున్నారు. రెండు వారాలు గడిచిపోయినా ఈ సంఘటనపై ప్రభుత్వం స్పందించక పోవడంతో కేంద్రప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తో బాటు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల విద్యార్ధులు అందరూ కలిసి ఈనెల 20న ‘చలో డిల్లీ’ కార్యక్రమానికి సిద్దం అవుతున్నారు. అంతకంటే ముందుగా ఈనెల 8న ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో యూనివర్సిటీ విద్యార్ధులు తమతమ రాష్ట్రాలలో బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించుకొన్నారు.

రోహిత్ ఆత్మహత్యను అన్ని రాజకీయ పార్టీలు తమకు రాజకీయ లబ్ది కలిగించే అంశంగానే పరిగణించి విద్యార్ధులను రెచ్చగొట్టాయి తప్ప ఇంచుమించు అన్ని యూనివర్సిటీలలో నెలకొన్న ఇటువంటి పరిస్థితులను, సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయడానికి ముందుకు రాలేదు. రాజకీయ నేతలు వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోయారు కానీ సమస్య మాత్రం నేటికీ అలాగే నిలిచి ఉంది. విద్యార్ధులు ఇప్పుడు చేయబోయే ప్రయత్నాలయినా సఫలం అవుతాయని ఆశించడం కష్టం. ఎందుకంటే వారు ఇద్దరు కేంద్రమంత్రులను వారి మంత్రి పదవుల నుంచి తొలగించి వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజకీయ అవగాహన ఉన్న వారెవరయినా అది అసాధ్యమని చెప్పగలరు. కనుక విద్యార్ధులు ఇటువంటి ఆందోళనలు చేసి దేశముదురు రాజకీయ నాయకులపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తూ విలువయిన తమ సమయాన్ని, చదువులను దానితో ముడిపడున్న తమ భవిష్యత్ ని నాశనం చేసుకోవడం కంటే, నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మంచిది. లేకుంటే యూనివర్సిటీ యాజమాన్యాలతో చర్చించి ఈ సమస్యను తమ పరిధిలో పరిష్కరించుకోవడం అన్నిటి కంటే ఉత్తమం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com