హైదరాబాద్: మ్యాగీ నూడిల్స్‌లో హానికర రసాయనాలు అధికమోతాదులో ఉన్నట్లు బయటపడటంతో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా డోమినోస్ పిజ్జా, మొనాకో బిస్కెట్స్‌పైకూడా వేటు పడింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఆమ్రోహా జిల్లాలోని గజ్రౌలా అనే పట్టణంలో ఉన్న డోమినోస్ పిజ్జా రెస్టారెంట్ లైసెన్స్‌ను ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీె(ఎఫ్‌డీఏ) రద్దుచేసి తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆ రెస్టారెంట్‌లో అన్ని అమ్మకాలనూ నిషేధించింది. ఒక ఫిర్యాదుపై స్పందిస్తూ ఎఫ్‌డీఏ ఆ రెస్టారెంట్ లోని టమోటా సాస్‌ను కొల్‌కతాలోని ల్యాబ్‌కు పంపగా అది తినటానికి ఆమోదయోగ్యమైనది కాదని అక్కడ రుజువయింది.
మరోవైపు అలహాబాద్ నగరంలో గత సోమవారం పార్లే కంపెనీవారి మొనాకో బిస్కెట్స్ తిన్న ఒక బాలిక కళ్ళు తిరిగి పడిపోవటంతో అలహాబాద్ జిల్లా అధికారులు సూపర్ డిస్ట్రిబ్యూటర్ గోదాములపై దాడిచేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్స్‌ను పరీక్షలకు పంపి అలహాబాద్, పరిసర ఆరు జిల్లాలలో ఆ బిస్కెట్స్ సరఫరాను నిషేధించారు. పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.