రాజమండ్రి పుష్కరాలలో మరొక అపశ్రుతి జరిగింది. బుదవారం రాత్రి 7.30-8.00గంటల మధ్య పుష్కర్ ఘాట్ కి దగ్గరలో ఉన్న గోకవరం బస్టాండ్ వద్ద ఒక చిన్న హోటల్లో గ్యాస్ లీకయి సిలిండర్ పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి క్షణాలలో చుట్టుపక్కలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కానీ నలుగురు వ్యక్తులకి తీవ్ర గాయలయినట్లు సమాచారం. సమీపంలో ఉన్న మూడు పోలీస్ వాహనాలు, ఒక ఆటో రిక్షా, కొన్ని దుఖాణాలు మంటల్లో కాలిపోయాయి. అక్కడే ఉన్న పోలీసులు చాలా నేర్పుగా చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలను, అక్కడ పార్కింగ్ చేసిన ఇతర వాహనాలను ఒక క్రమపద్దతిలో ప్రమాద స్థలం నుండి దూరంగా తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంగతి తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది క్షణాలలో అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతం చుట్టూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కొందరు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రజలకి దైర్యం చెపుతూ పోలీసులకి, పుష్కర నిర్వాహకులకి తగిన సూచనలు చేస్తున్నారు. ఈ ప్రమాదం గురించి ఎటువంటి పుకార్లు నమ్మవద్దని ఎవరూ తీవ్రంగా గాయపడలేదని, ప్రాణ నష్టం జరగలేదని కనుక ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.