రివ్యూ: ఊర్వ‌శివో.. రాక్ష‌సివో

urvasivo rakshasivo movie telugu review

తెలుగు360 రేటింగ్: 2.75/5

ప్రేమ‌క‌థ‌ల్లో సంఘ‌ర్ష‌ణే ప్ర‌ధానం. ఎందుకంటే దాదాపుగా ప్ర‌తీ ప్రేమ క‌థా ఒకేలా మొల‌వుతుంది. ఒకేలా పూర్త‌వుతుంది. ఆ మ‌ధ్య‌లో జ‌రిగే డ్రామా ఆసక్తి క‌రంగా ఉండాలి. ల‌వ్ స్టోరీ అన‌గానే హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ పండితే చాలనుకొంటారంతా. అది ముఖ్య‌మైన అంశ‌మే. కానీ హీరో, హీరోయిన్ల‌తో పాటు ఆ చుట్టు ప‌క్క‌ల ఉన్న పాత్ర‌లు కూడా ఆ డ్రామాలో భాగం కావాలి. అప్పుడే ల‌వ్ స్టోరీల‌కు ఎగ‌స్ట్రా మైలేజీ వ‌స్తుంది. ఇదంతా ఎందుకంటే… ఇప్పుడు మ‌నం ఓ ప్రేమ‌క‌థ గురించి చెప్పుకొంటున్నాం. అదే.. `ఊర్వ‌శివో – రాక్ష‌సివో`. ప్రేమించేది పెళ్లి చేసుకోవ‌డానికే అని అనుకొనే ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు – ప్రేమ ఉంటే పెళ్లి అవ‌స‌రం లేద‌నుకొనే ఓ అల్ట్రా మోడ్ర‌న్ అమ్మాయి.. వీళ్ల మ‌ధ్య స‌ర‌దాగా సాగిపోయే ల‌వ్ స్టోరీగా `ఊర్వ‌శివో… రాక్ష‌సివో` ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఇందులో డ్రామా ఎంత‌, కాన్ఫిక్ట్ ఏంటి? ఈ ప్రేమ క‌థ‌కు పునాది రాళ్లుగా మారిన పాత్ర‌లేంటి?

శ్రీ (అల్లు శిరీష్‌) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. బుద్దిమంతుడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్‌. అమ్మ (ఆమ‌ని) పెళ్లి సంబంధాలు చూస్తుంటుంది. ప‌ద్ధ‌తిగా ఇంటి ప‌ట్టున ఉండే అమ్మాయిని తీసుకొచ్చి.. త‌న కొడుక్కి పెళ్లి చేయాల‌న్న ఆశ ఆమెది. అయితే శ్రీ‌.. పక్క ఆఫీసులో ప‌నిచేసే సింధు (అను ఇమ్మానియేల్‌)ని దొంగ‌చాటుగా ప్రేమించేస్తుంటాడు. త‌నేమో అల్ట్రా మోడ్ర‌న్ అమ్మాయి. పెళ్లిపై పెద్ద న‌మ్మకం లేదు. జీవితంలో ల‌క్ష్యాలంటూ చాలా ఉన్నాయి. అనుకోకుండా.. శ్రీ ప‌నిచేసే ఆఫీసుకి షిఫ్ట్ అవుతుంది సింధు. దాంతో… శ్రీ మెల్ల‌గా ప‌రిచ‌యం పెంచుకొంటాడు. శ్రీ‌లోని మంచిత‌నం, అమాయ‌క‌త్వం సింధుకి న‌చ్చేస్తాయి. ఇద్ద‌రూ ఓ ఏకాంత స‌మ‌యంలో శారీర‌కంగా క‌లిసిపోతారు. ఆ త‌ర‌వాత‌.. ఇక పెళ్లే అనుకొంటున్న త‌రుణంలో త‌న‌కు పెళ్లీ గిల్లీ ప‌డ‌వ‌ని… సెక్స్ కూడా క్యాజువ‌ల్ గా జ‌రిగిపోయింద‌ని చెప్పి షాక్ ఇస్తుంది సింధు. తాను ప్రేమించింది పెళ్లి చేసుకోవ‌డానికే అని శ్రీ అంటే… పెళ్లి చేసుకోక‌పోయినా క‌లిసి ఉంటే ఆనందం ఉంది అని సింధూ న‌మ్ముతుంది. మ‌రింత‌కీ ఈ రెండు వాద‌న‌ల్లో ఏది గెలిచింది? ఎవ‌రు త‌గ్గారు? అనేది వెండి తెర‌పై చూడాలి.

పెళ్లి… స‌హ‌జీవ‌నం వీటి మ‌ధ్య ఊగిస‌లాట ధోర‌ణే ఈ సినిమా. ప్రేమ క‌థా చిత్రాల్లో సెక్స్‌ని లైట్ తీసుకొనే అబ్బాయిల క‌థ‌లు ఇంత వ‌ర‌కూ చూశాం. ఇది రివ‌ర్స్ గేర్‌. అలాంటి అమ్మాయిని ఓ అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి ఎలా ఒప్పించాడ‌న్న‌ది మిగిలిన క‌థ‌. చిన్న చిన్న పాయింట్లు మాట్లాడుకోవ‌డానికి బాగుంటాయి. కానీ రెండున్న‌ర గంట‌ల సినిమాగా మ‌ల‌చాలంటే ద‌ర్శ‌కుడికి టాలెంట్ అవ‌స‌రం. ట్రైల‌ర్ చూసి క‌థ చెప్పేసే స్థాయి ప్రేక్ష‌కుల‌కు ఎప్పుడో వ‌చ్చేసింది. అలాంట‌ప్పుడు.. వాళ్ల‌ని ఎంగేజ్ చేసేలా సీన్లు రాసుకోవ‌డం మామూలు విష‌యం కాదు. ఈ టాస్క్ ని రాకేష్ శ‌శి ఈజీగా దాటేశాడు. త‌ను రాసుకొన్న పాత్ర‌లు, వాళ్ల‌కంటూ ఉండే క్యారెక్టరైజేష‌న్స్‌, సంభాష‌ణ‌లు… ఇవ‌న్నీ మామ‌లూ క‌థ‌ని మ‌సిపూసి మారేడు కాయ చేసేశాయి. ఎక్క‌డా `ఈ సినిమా ఎంత‌కీ అయిపోదేంటి?` అనే ఫీలింగ్ రాదు. `శుభం కార్డు ఎప్పుడు ప‌డుతుందో` అనే బెంగా క‌ల‌గ‌దు. అంత‌గా టైమ్ పాస్ అయిపోతుంది. స‌గ‌టు స‌న్నివేశాల‌న్ని వినోదపు పూత పూసి చెబితే.. మెరిసిపోతాయి. ఈ ట్రిక్కు క‌నిపెట్టాడు రాకేష్‌. అందుకే ప్ర‌తీ సీన్‌లోనూ.. ఏదో ఓ ఛ‌మ‌క్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు. హీరో అమాయ‌క‌త్వం, హీరోయిన్ అల్ట్రా మోడ్ర‌న్ వ్య‌వ‌హారాలు రొటీన్‌గా అనిపించినా.. వాళ్ల మ‌ధ్య వ‌చ్చే సీన్స్‌లో ఫ్రెష్ నెస్ ఉంటుంది. వాటిని డిజైన్ చేసిన విధానంలో కూడా. ఉదాహ‌ర‌ణ‌కు.. హీరో – హీరోయిన్ల ప‌బ్ సీన్‌. `కెన్ ఐ పే యువ‌ర్ బిల్‌` అనే సీన్‌.. రాసుకొనేట‌ప్పుడు సింపుల్‌గా ఉండొచ్చు. కానీ… ప‌బ్ లోనే కుట్టు మిష‌న్‌తో ద‌ర్శ‌న‌మిచ్చి.. చివ‌ర్లో హీరో అమాయ‌క‌త్వ‌పు ప్ర‌తాపం చూసి…. సైడైపోయే సీన్‌.. న‌వ్విస్తుంది. ఇలాంటి స‌ర‌దా ఆలోచ‌న‌లు ఈ సినిమాలో చాలా క‌నిపిస్తాయి. కామెంట్రీ బాక్సులో కూర్చుని జ‌రుగుతున్న స‌న్నివేశాన్ని రన్నింగ్ కామెంట్రీలో వినిపిస్తూ.. చాంతాడంత విష‌యాన్ని సూక్ష్మంగా చెప్పిన ప‌ద్ధ‌తిలోనూ ద‌ర్శ‌కుడి చ‌మ‌త్కారం క‌నిపిస్తుంది. పైగా అక్క‌డ ఉన్న‌ది.. సునీల్‌, వెన్నెల కిషోర్‌. వాళ్ల‌… సెన్సాఫ్ హ్యూమ‌ర్‌, టైమింగ్ ఆ స‌న్నివేశాన్ని మ‌రింత పండించాయి. పెళ్లి చూపులు సీన్‌లో సునీల్ వాడే క్రికెట్ భాష‌, క‌రెంటు పోయిన‌ప్పుడు న‌డిచిన క‌న్‌ఫ్యూజ‌న్ కామెడీ.. ఇవ‌న్నీ కాల‌క్షేప బ‌ఠానీలు.

సెకండాఫ్‌లో… స‌హ‌జీవ‌నం కాన్సెప్టు తెర‌పైకి వ‌స్తుంది. రెండు ఇళ్ల మ‌ధ్య హీరో ప‌రుగులు పెడుతూ తిప్ప‌లు ప‌డే సీన్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. అయితే… ద‌ర్శ‌కుడు కేవ‌లం కామెడీ ట్రాకుల‌నే న‌మ్ముకోలేదు. అమ్మ ఎమోష‌న్‌కీ చోటిచ్చాడు. క్లైమాక్స్ మ‌న ఊహ‌కు ముందే అందేస్తుంది. కాక‌పోతే… దాన్నెందుకో ద‌ర్శ‌కుడు ఇంకో రెండు సీన్ల‌కు లాగాడు. ముందే ముగించేయొచ్చు కూడా. కాక‌పోతే.. పెళ్లి గొప్ప‌దా, స‌హ‌జీవ‌నం గొప్ప‌దా? అని చెప్ప‌డానికి ఆ రెండు సీన్ల‌నీ వాడుకోవాల్సివ‌చ్చింది. కోర్టు సీన్ ఒకే ఒక్క డైలాగ్‌తో పూర్తి చేశాడు కానీ, అక్క‌డ మంచి ఎమోష‌న్ పండించ‌డానికి స్కోప్ ఉంది. స‌హ‌జీవ‌నం మాటెత్త‌గానే సంప్ర‌దాయాల పేరుతో మీద‌డిపోయే పెద్ద మ‌నుషుల‌కు చుర‌క‌లు అంటించే స్కోప్ ద‌ర్శ‌కుడికి ద‌క్కింది. కానీ.. దాన్ని స‌రిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ముద్దులు, హ‌గ్గులు, బెడ్ రూమ్ రొమాన్స్‌.. ఇలాంటి హాట్ సీన్లు కావ‌ల్సిన‌న్ని ఉన్నాయి. ముద్దులు పెట్టుకోవ‌డానికి శిరీష్‌, పెద‌వులు అప్ప‌గించ‌డానికి అను ఇమ్మానియేల్ ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌లేదు. కాక‌పోతే.. ఆయా సీన్ల‌ను కాస్త రొమాంటిక్‌గానే డిజైన్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఏమాత్రం హ‌ద్దు దాటినా వెన్నెల కిషోర్ భాష‌లో చెప్పాలంటే ఇదో ఆల్ట్ బాలాజీ.. కాన్సెప్టు అయిపోయేది.

త‌న బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు స్ప‌ష్టంగా తెలుసుకొన్నాడు శిరీష్‌. త‌న‌కు సూట‌య్యే క‌థ‌ని, పాత్ర‌నీ ఎంచుకొన్నాడు. ఎక్క‌డా ఓవ‌రాక్ష‌న్ల గోల లేదు. ప‌ద్ధ‌తిగా త‌న ప‌ని తాను చేసుకొంటూ వెళ్లిపోయాడు. అనుది ఎప్పుడూ ఓకేర‌క‌మైన ఎక్స్‌ప్రెష‌న్‌. కాక‌పోతే.. త‌న డ‌బ్బింగ్ సూటైంది. ఆ డ‌బ్బింగ్ అడ్డు పెట్టుకొనే ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచింది అను. త‌న లుక్స్ ఎప్ప‌టిలా బాగున్నాయి. ఈ సినిమాని మోసిన మ‌రో ఇద్ద‌రు.. సునీల్‌, వెన్నెల కిషోర్‌. క్రికెట్ ప‌రిభాష‌లో సునీల్ చెప్పే డైలాగులు.. వెన్నెల కిషోర్ ఓటీటీ ప‌రిజ్ఞానం.. కొన్ని స‌న్నివేశాల్ని నిల‌బెట్టాయి.

పాట‌లు ఓకే అనిపిస్తాయి. విజువ‌ల్‌గా బాగున్నాయి. కెమెరా ప‌నిత‌నం కూల్ గా ఉంది. ఎడిటింగ్ షార్ప్ గా సాగింది. అయితే ఎవ‌రెన్ని చేసినా ఎక్కువ మార్కులు ద‌ర్శ‌కుడికే ప‌డ‌తాయి. ఓ చిన్న పాయింట్ ని ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ లేకుండా, అందంగా, ఆహ్లాద‌క‌రంగా తెర‌కెక్కించాడు. శిరీష్ సినిమా అంటే.. దాదాపుగా అంచ‌నాలు లేకుండానే థియేట‌ర్ల‌కు వెళ్తారు జ‌నాలు. వాళ్ల‌ని క‌చ్చితంగా స‌ర్‌ప్రైజ్ చేస్తుంది. కాల‌క్షేపానికైతే ఎలాంటి ఢోకా ఉండ‌దు.

ఫినిషింగ్ ట‌చ్‌: ఊర్వ‌శే…

తెలుగు360 రేటింగ్: 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close