ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు ప్రారంభించాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా దేశవ్యాప్తంగా ఉన్న కీలక సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు , క్షిపణి వ్యవస్థలపై భారీ దాడులు ప్రారంభించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలో కూడా పేలుళ్లు సంభవించడంతో ఈ దాడులు చిన్నవి కాదని తేలిపోయింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించడంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అనేక దేశాలు తమ గగనతలాన్ని మూసివేసి, విమాన సర్వీసులను రద్దు చేశాయి.
ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణమే కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. దీనివల్ల భారత్ వంటి చమురు దిగుమతి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, తద్వారా రవాణా ఖర్చులు , నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
పెట్టుబడిదారులకు సురక్షితమైన ఆశ్రయంగా భావించే బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ సమయాల్లో స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉండటంతో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్ళిస్తారు. దీనివల్ల తులం బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో కూడా బంగారం మరియు వెండి ధరలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన ి చెబుతున్నారు.
ఈ ఘర్షణ కేవలం రెండు మూడు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీసేలా ఉంది. ఈ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే, ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం దిశగా వెళ్లే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.