అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రపంచదేశాలన్నింటినీ భయపెట్టడానికి ట్రంప్ వాడిని ఆయుధం సుంకాలు. ఈ సుంకాల వల్ల లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఆయన సంబర పడ్డారు. కానీ ఇప్పుడు ఆ సుంకాల సునామీ ఆయనను చుట్టుముట్టింది. అమెరికా సుప్రీంకోర్టు తాజా తీర్పు ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక సవాలును విసిరింది. అత్యవసర అధికారాలను అడ్డం పెట్టుకుని విధించిన గ్లోబల్ టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేయడంతో ఇప్పుడు వందల బిలియన్ డాలర్ల రీఫండ్ అంశం తెరపైకి వచ్చింది.
డబ్బులు తిరిగి చెల్లించాలా?
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు వసూలు చేసిన టారిఫ్‌లను దిగుమతిదారులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, న్యాయస్థానం రీఫండ్ ప్రక్రియపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా, ఆ బాధ్యతను దిగువ కోర్టులకు వదిలేసింది. దీనివల్ల రీఫండ్లు వెంటనే జరగవు. ఒక్కో కంపెనీ విడివిడిగా దరఖాస్తు చేసుకోవడం లేదా సామూహిక వ్యాజ్యాలు వేయాల్సి ఉంటుంది. ఈ రీఫండ్ ప్రక్రియ ఒక పెద్ద గందరగోళం లా మారే అవకాశం ఉంది.
ట్రంప్ ప్లాన్-బి – ఇతర మార్గాల్లో పన్నులు
కోర్టు తీర్పు వెలువడగానే వైట్ హౌస్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే వసూలు చేసిన పన్నులను ఇవ్వకుండా అడ్డుకోవడానికి ట్రంప్ ప్రత్యామ్నాయ చట్టాలను వాడే అవకాశం ఉంది. టారిఫ్స్‌ను నేషనల్ ఎమర్జెన్సీ కింద కాకుండా అన్యాయమైన వాణిజ్య పద్ధతులు వంటి ఇతర చట్టాల కింద రీ-బ్రాండ్ చేసి మళ్ళీ విధించవచ్చు. అంటే, పాత పన్నులను తిరిగి ఇస్తూనే, అదే మొత్తాన్ని కొత్త చట్టాల కింద మళ్లీ వసూలు చేసేలా రోడ్‌మ్యాప్ సిద్ధం చేసే అవకాశం ఉంది. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఈ తీర్పును దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి గా అభివర్ణించారు. ఒకవేళ రీఫండ్లు ఇవ్వాల్సి వస్తే దేశ ఆర్థిక లోటు భారీగా పెరుగుతుందని, అది అమెరికా ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదమని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా కోర్టు తీర్పు అమలును జాప్యం చేయడానికి లేదా రీఫండ్లకు అంగీకరించని కొత్త చట్టాలను కాంగ్రెస్ ద్వారా తెచ్చేందుకు రాజకీయ మద్దతు కూడగట్టే అవకాశం ఉంది.
రీఫండ్‌ను అడ్డుకునే వ్యూహాలు
డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఉండటానికి ట్రంప్ ప్రభుత్వం కొన్ని సాంకేతిక ఎత్తుగడలు వేయగలదు. ముఖ్యంగా, రీఫండ్ ప్రక్రియను అత్యంత క్లిష్టంగా మార్చడం, కంపెనీలపై పరోక్షంగా ఒత్తిడి తీసుకురావడం లేదా రీఫండ్ మొత్తాన్ని నేరుగా నగదు రూపంలో ఇవ్వకుండా భవిష్యత్తులో చెల్లించాల్సిన ఇతర పన్నులకు క్రెడిట్స్ గా సర్దుబాటు చేస్తామని చెప్పడం వంటివి చేయవచ్చు. దీనివల్ల ప్రభుత్వ ఖజానా నుండి ఒకేసారి నగదు బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు.
