తిమ్మిని జమ్మిని చేస్తే చాలు బయటపడిపోతాం .. వాస్తవాలు దాచి పెట్టేస్తాం అని అనుకుంటున్నారు వైసీపీ నేతలు. అందుకే గూగుల్ డేటా సెంటర్ నుంచి.. బోలేబాబా వరకూ అన్నింటినీ మసిపూసిమారేడు కాయ చేసి హమ్మయ్య అనుకుంటున్నారు. కానీ వాస్తవాలు బయటకు తెలియకుండా ఉంటాయా?. అవి నిప్పులా దహించకుండా వదిలి పెడతాయా?
కళ్ల ముందు కనిపించేదాన్ని కూడా మాయ చేస్తున్న జగన్
అబద్ధాన్ని నిజం చేయాలని చూడటం వినాశనానికి సంకేతం. ప్రస్తుతం వైసీపీ అనుసరిస్తున్న తీరు సరిగ్గా అలాగే ఉంది. ఎంతగా అంటే విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ రాబోతోందని సాక్షాత్తూ ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటిస్తే, దానికి అదానీ సంస్థతో ముడిపెట్టి బురదజల్లడం వైసీపీ నైజం. అదానీ కేవలం మౌలిక సదుపాయాలు కల్పించే భాగస్వామి అని తెలిసి కూడా, అది గూగుల్ ప్రాజెక్ట్ కాదు అని నమ్మించే ప్రయత్నం చేసేంత. వీరు ప్రజల విజ్ఞతను అవమానిస్తున్నారు. ఈ విషయంలోనే ఇంత ప్రచారం చేస్తున్నారంటే.. ఇక కల్తీ నెయ్యి కేసులో ఇంకెంత చేస్తారో చెప్పాల్సిన పని లేదు.
బోలేబాబా ముసుగులో అసత్యాల వేట
కల్తీ నెయ్యి వ్యవహారంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న మాట వాస్తవం. ఈ పాపంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు ఆ మరకను చంద్రబాబుకు , హెరిటేజ్ సంస్థకు అంటించాలని ఘోరమైన తప్పిదాలకు పాల్పడుతున్నారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ కి, బోలేబాబా పేరుతో ఉన్న మరో సంస్థకు, హెరిటేజ్‌కు అసలు సంబంధమే లేకపోయినా లింకులు పెట్టడం జగన్ రెడ్డి మార్క్ కుట్ర రాజకీయాలకు పరాకాష్ఠ. పేరు లో పోలికలు ఉన్నాయని ఊరు, పేరూ లేని కంపెనీలను తీసుకొచ్చి ప్రతిష్టాత్మక సంస్థలతో పోల్చడం ద్వారా ప్రజలను మభ్యపెట్టగలమని అనుకోవడం ముమ్మాటికీ భ్రమ.
తప్పు చేసి.. దేవుడిపైనే నెట్టేస్తారా?
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారం సామాన్యమైనది కాదు. అక్కడ వాడిన నెయ్యి కల్తీ అని రిపోర్టులు స్పష్టం చేస్తున్నా, ఇంకా ఎదురుదాడికి దిగడం జగన్ రెడ్డి అహంకారానికి నిదర్శనం. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దశాబ్దాల చరిత్ర ఉన్న హెరిటేజ్ సంస్థపై బురద చల్లడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించవచ్చని ఆయన భావిస్తున్నారు. కానీ, నిజం అనేది నిఖార్సైన నిప్పు. దాన్ని అబద్ధాల పొరలతో కప్పి ఉంచాలని చూస్తే ఆ సెగ మొదట జగన్ రెడ్డికే తగులుతుంది. భక్తుల ఆక్రందన, దేవుడి ఆగ్రహం ముందు ఈ ఫేక్ ప్రచారాలు ఎంతో కాలం నిలబడలేవు.
ప్రజలు అంత అమాయకులు కాదు!
నిజం అంటే మనం నమ్మించేదే అని జగన్ రెడ్డి ఒక సరికొత్త సిద్ధాంతాన్ని రాసుకున్నట్లున్నారు. కానీ, గూగుల్ డేటా సెంటర్ నుంచి బోలేబాబా కంపెనీ వరకు ప్రతి విషయంలోనూ మసిపూసి మారేడు కాయ చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అవాస్తవాలతో కొంతకాలం బండి నడపగలరు కానీ, చరిత్రలో నిలబడలేరు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకుని పవిత్రమైన ఆలయాలను, వ్యవస్థలను గౌరవించడం నేర్చుకోవాలి. లేదంటే, అబద్ధాల కోట కూలిపోయిన రోజున వాస్తవాల తాకిడికి జగన్ రెడ్డి రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. నిజాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే ఆయనకు, ఆయన పార్టీకి అంత మంచిది.
