అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. చెల్లని పాలన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెన్నులో ఇంక్ అయిపోయేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తున్నారు కానీ అమల్లోకి వస్తున్నవి మాత్రం అరకొరే. చివరికి ఆయన హడావుడి చేసిన పుట్టుకతో పౌరసత్వం అంశం కూడా న్యాయవివాదాల్లో ఉంది. చివరికి భారతీయులు అమెరికాలో పని చేసి..ఇండియాకు డబ్బులు పంపితే ఐదు శాతం పన్ను వేస్తామని చెప్పి..దానికి ఉత్తర్వులు ఇస్తే అవి కూడా చెల్లలేదు. దీనికి కారణం అన్నీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లుగా ఉండటమే.
విచ్చలవిడిగా బహిష్కరణ నిర్ణయాలు కోర్టుల్లో వివాదాలుగా మారాయి. చాలా వరకూ కోర్టులు ఆపాయి. విదేశాలకు సంబంధించినవే కాదు.. అమెరికా సంయుక్త రాష్ట్రాల విషయంలో తీసుకునే నిర్ణయాలు కూడా అమల్లోకి రావడంలేదు. పలు సంస్థలకు నిధులు ఆపేయాలన్న నిర్ణయాలను కోర్టులు కొట్టి వేశాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు బిలియన్ డాలర్ల గ్రాంట్ ఆపేయాలనుకున్నారు కానీ కోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసింది. ట్రంప్ వ్యవహారం తనకు మోకాలు రుద్దుకున్నప్పుడు ఏ ఆలోచన వస్తే దాన్ని అమలు చేయాలన్నట్లుగా ఉంది. రాజ్యాంగాన్ని..ఇతర అంశాలను పట్టించుకోవడం లేదు .
ఇప్పటి వరకూ ట్రంప్ ఇలా చేస్తాడు.. అలా చేస్తాడు అని భయపెడుతున్నారు. ఆయన కూడా అలాగే చేస్తున్నారు. కానీ ఏదీ పద్దతిగా చేయడం లేదు. అన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి చేస్తున్నారు. ఫలితంగా కోర్టుల్లో ఆగిపోతున్నాయి. కోర్టులు, న్యాయమూర్తులపై నిందలేస్తున్నారు. ఇది అమెరికాలో మారిపోతున్న అస్తవ్యస్థ పాలనకు నిదర్శనంగా మారుతోంది. ఈ నాలుగేళ్లలో అమెరికా ఇంకెన్ని ఉత్పాతాలు చూడాల్సి వస్తుందోనని సగటు అమెరికన్ కంగారు పడుతున్నాడు.