మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో రాబోతోంది. అంటే సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. ఇటీవలే రెండో పాటని విడుదల చేశారు. మార్చి రెండో వారంలో ట్రైలర్ రాబోతోంది. మరో రెండు పాటలు బాకీ.
ఈలోగా బిజినెస్ డీల్ కూడా క్లోజ్ చేసుకొనే పనిలో ఉంది చిత్రబృందం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకొంది. దాదాపు రూ.80 కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం. ‘ఓజీ’ సినిమాకూ ఇంచుమించుగా ఇంతే బేరం కుదిరింది. ఓజీ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొంది. ఓటీటీలోనూ ఆదరణ దక్కించుకొంది. అందుకే ఉస్తాద్ ఓటీటీ డీల్ ఈజీగా క్లోజ్ అయ్యింది.
మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. మైత్రీ డిస్టిబ్యూషన్లోనూ ఉంది కాబట్టి.. అన్ని ఏరియాల్లోనూ ఓన్ రిలీజ్ చేసుకొనే అవకాశం ఉంది. కర్నాటకలో హోంబలే సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఓవర్సీస్ డీల్ కూడా త్వరలో క్లోజ్ అవ్వబోతోందని టాక్. కొన్ని పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ ఉస్తాద్ ఓటీటీ కి మంచి రేటు రావడం విశేషమే.
