కమర్షియల్ సినిమా రూపు రేఖలు మారిపోయాయి. వరల్డ్ బిల్డింగ్ అంటూ కొత్త కాన్సెప్టులు, కొత్త ప్రపంచాల వైపు దృష్టి సారిస్తున్నారు దర్శకులు. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, హీరోయిజం, బిల్డప్ షాట్స్…. వీటిపై దృష్టి తగ్గింది. ఫక్తు సూత్రాలతో రూపొందిన కమర్షియల్ సినిమాలు చాలా అరుదైపోయాయి. ఈనేపథ్యంలో ‘ఉస్తాద్’ రిలీజ్ అవుతోంది. ”ఈమధ్య కాలంలో ఫార్ములా, కమర్షియల్ సినిమాలు రాలేదు. ఆ లోటు.. ఈ సినిమా తీరుస్తుంది” అని స్వయంగా హరీష్ శంకర్ ఈ సినిమా గురించి చెప్పుకొంటున్నారు. రెగ్యులర్ ఫార్మెట్ లో సినిమాలు రావడం తగ్గిపోతున్న ఈ తరుణంలో `రెగ్యులర్` సినిమా కూడా కొత్తగా కనిపిస్తుందేమో అన్నది అందరి ఆశ.
పవన్ కల్యాణ్ ఇచ్చిన 45 రోజుల్లోనే ఈ సినిమా పూర్తయ్యింది. 45 రోజుల్లో 10 రోజులు పాటలకు పక్కన పెడితే… కేవలం 35 రోజుల్లో సినిమాని పూర్తి చేసినట్టు. ఓ కమర్షియల్ సినిమాని ఇంత తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది గనుక సక్సెస్ అయితే మిగిలిన హీరోలకు, దర్శకులకు కాస్త ధైర్యం వస్తుంది. ఫార్ములా సినిమాలు తీయడానికి మొగ్గు చూపిస్తారు. వరల్డ్ బిల్డింగ్ పేరు చెప్పి రెండేళ్లు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్న హీరోలు కాస్త పునరాలోచించుకొనే సమయం దొరుకుతుంది. “హరీష్ శంకర్‌లా ఫాస్ట్ గా సినిమాలు తీసే దర్శకులు ఉంటే ఏడాదికి 10 సినిమాలైనా చేస్తాం“ అని మైత్రీ నిర్మాతలే చెబుతున్నారు. సో.. ‘ఉస్తాద్’ కమర్షియల్ గా మంచి హిట్ కొడితే.. లెక్కలు మారే అవకాశం నూటికి నూరు శాతం ఉంది. తాము కోరుకొనే వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమాలు చేస్తూనే, మధ్యమధ్యలో కమర్షియల్ సినిమాలు చేస్తే, ఇండస్ట్రీకి కూడా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది.
