భాజ‌పాని స‌మ‌ర్థంగా తిప్పికొట్టే టాపిక్ ఉత్త‌మ్ కి దొరక‌ట్లేదా..?

తెలంగాణ‌లో భాజ‌పా దూసుకుపోయే ప్ర‌య‌త్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని నైరాశ్యాన్ని అనుకూలంగా మార్చుకుని, తెరాస‌కు తామే ప్ర‌త్యామ్నాయం అనే స్థాయిలో ప్రొజెక్టు చేసుకునే ప‌నిలో ఉంది. అయితే, భాజ‌పా ప్ర‌య‌త్నాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డంలో కాంగ్రెస్ ఇంకా వెన‌క‌బ‌డే ఉంద‌ని చెప్పాలి! ఏ పాయింట్ తో ఆ పార్టీ మీద విమ‌ర్శ‌లు చేయాలి అనేది టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఇంకా క్లారిటీ వ‌చ్చిన‌ట్టుగా లేదు. అందుకే, ఇంకా.. తెరాస‌, భాజ‌పాలు రెండూ మిత్ర‌ప‌క్షాలే అనీ, అవ‌స‌ర‌మొచ్చిన‌ప్పుడు ఒక‌రికొక‌రు బాగానే స‌హ‌క‌రించుకుంటార‌నీ, నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ మోడీ విధానాల‌కు కేసీఆర్ మ‌ద్ద‌తు ల‌భిస్తూనే ఉంద‌నీ అంటున్నారు ఉత్త‌మ్‌.

రాష్ట్రంలో ఎప్ప‌టికైనా తెరాస‌కు కాంగ్రెస్ మాత్ర‌మే ప్ర‌త్యామ్నాయ‌మ‌న్నారు ఉత్త‌మ్‌. కేంద్రంలో అధికారంలో ఉన్నామ‌ని గంతులేయ‌డ‌మే త‌ప్ప ఇక్క‌డ వాళ్ల‌కి ప‌ట్టు ఏం లేద‌న్నారు. ల‌క్కీగా ఓ నాలుగు సీట్లు వ‌చ్చాయ‌న్నారు. 2023లో తామే అధికారంలోకి రాబోతున్నామ‌ని జోస్యం చెప్పారు! కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రుగుతోంద‌ని తాము ఎప్ప‌ట్నుంచో చెబుతున్నామ‌నీ, ఇప్పుడు భాజ‌పా నేత‌లు కొత్త‌గా చెబుతున్నార‌నీ, కేసీఆర్ తో దోస్తీ లేక‌పోతే సీబీఐ ఎంక్వ‌యిరీ ఎందుకు వేయ‌డం లేద‌న్నారు ఉత్త‌మ్‌. ట్రిపుల్ త‌లాక్, ఆర్టిక‌ల్ 370 బిల్లుల‌కు తెరాస మ‌ద్ద‌తు ఇచ్చింద‌నీ, అవ‌స‌ర‌మొచ్చిన‌ప్పుడు ఆ రెండు పార్టీలూ అల‌య్ బ‌ల‌య్ అనుకుంటూనే ఉన్నాయ‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ ప్రారంభానికి ప్ర‌ధాని వ‌చ్చార‌నీ, ఆ త‌రువాత లోక్ స‌భ‌లో కేసీఆర్ ని మెచ్చుకుంటూ చాలాసార్లు మాట్లాడార‌ని ఉత్త‌మ్ గుర్తుచేశారు.

స‌రే, ఇప్పుడు ఎన్ని గుర్తు చేసినా… తెరాస‌, భాజ‌పాలు క‌లిసే ఉన్నాయ‌ని ఎస్టాబ్లిష్ చేసే ప్ర‌య‌త్న‌మే స‌రైంది కాదు! దాన్ని ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే, భాజ‌పా వైఖ‌రి చాలా స్ప‌ష్టంగా ఉంది. ప్రాంతీయ పార్టీల‌తో ఇప్పుడు వారికి అవ‌స‌రం లేదు. రాష్ట్రాల్లో ఎద‌గాలన్న‌దే వారి ల‌క్ష్యం. ప‌క్క‌రాష్ట్రం ఏపీలో చూసుకున్నా… వైకాపా వెంట‌ప‌డుతోందేమోగానీ, ఆ పార్టీని ఉంచాల్సిన దూరంలోనే భాజ‌పా ఉంచుతోంది. తెలంగాణ‌లో భాజ‌పాని ఎదుర్కోవాలంటే… ఇలాంటిది బ‌ల‌మైన అంశంగా నిల‌వ‌లేదు. భాజ‌పాని త‌ట్టుకోవాలంటే ఇత‌ర అంశాలు వెతుక్కోవాల్సిన అవ‌స‌రం కాంగ్రెస్ కి బాగా ఉంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com