టీడీపీకి మరోసారి మద్దతు పలికిన వీహెచ్..!

తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు తెలుగుదేశం పార్టీకి మ‌రోసారి మ‌ద్ద‌తు ప‌లికే విధంగా మాట్లాడారు! ఈరోజు, భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్ షాని తిరుమల‌లో కొంత‌మంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. అమిత్ షా గో బ్యాక్, వియ్ వాంట్ స్పెష‌ల్ స్టేట‌స్ అంటూ నిర‌స‌న తెలిపారు. దీనిపై వీహెచ్ స్పందించారు. అమిత్ షాకి ఇంకా చాలా జ‌ర‌గ‌బోతుంద‌ని జోస్యం చెప్పారు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తే, ప్ర‌తీ ఒక్క‌డూ తంతాడు అని వీహెచ్ అన్నారు. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుని స‌న్నిధానంలో దాడి జ‌రిగిందంటే, ఇక అమిత్ షా ఎక్క‌డికిపోయినా ఆయ‌న‌ పని అయ్యేది గ్యారంటీ అనేశారు! ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తార‌నీ, గుణ‌పాఠం నేర్పిస్తార‌ని అన్నారు. క‌ర్ణాట‌క‌లో ప్ర‌ధాని మోడీ, అమిత్ షాలు చిల్ల‌ర రాజ‌కీయాలు చేశార‌నీ, సోనియా గాంధీని ఇటాలియ‌న్ అంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఏపీ విష‌యంలో కేంద్రంలోని భాజ‌పా అనుస‌రిస్తున్న వైఖ‌రిని ఇంత‌కుముందు కూడా వీహెచ్ త‌ప్పుబ‌ట్టిన సంద‌ర్భం ఉంది. గ‌త నెల 20న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఒక‌రోజు నిరాహార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే. దానికి కూడా కాంగ్రెస్ నేత వీహెచ్ మ‌ద్ద‌తు ప‌లికారు. ఒక్క టీడీపీని మాత్ర‌మే కాదు, ఏపీ ప్ర‌జ‌లంద‌రినీ భాజ‌పా మోసం చేసింద‌ని అప్పుడు చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిపించాల‌న్న ఉద్దేశంతోనే చంద్ర‌బాబు దీక్ష చేస్తున్నార‌ని మ‌ద్ద‌తు తెలిపారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌ద్ద‌తు తీసుకుని, తీరా అధికారంలోకి వ‌చ్చాక ఆ పార్టీని మోడీ మోసం చేశార‌ని ఆరోపించారు. ఒక ముఖ్య‌మంత్రికి ప్ర‌ధాని ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డం సరికాదనీ, దీన్ని దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని చంద్రబాబు చేస్తున్న ప్ర‌య‌త్నం మెచ్చుకోవ‌చ్చ‌న్నారు.

ఇప్పుడు, అమిత్ షా రాక సంద‌ర్భంగా టీడీపీ కార్య‌క‌ర్త‌ల నిర‌స‌న‌కు స‌మ‌ర్థింపుగా వీహెచ్ మాట్లాడారు! టీడీపీకి మ‌ద్ద‌తుగా, ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత వ‌రుస‌గా రెండోసారి చేసిన వ్యాఖ్య‌లుగా వీటిని చూడొచ్చు. జాతీయ స్థాయిలో ఎలాగూ భాజ‌పాతో క‌లిసే అవ‌కాశం టీడీపీకి లేదు. కాబ‌ట్టి, త‌మ‌కు టీడీపీ ద‌గ్గ‌రౌతుంద‌న్న ఆశ‌లేమైనా కాంగ్రెస్ కి ఉన్నాయా అనే అనుమానం క‌లుగుతోంది. లేదా, తెలంగాణ‌లో నీర‌సంగా ఉన్న టీడీపీ శ్రేణుల‌ను, వివిధ జిల్లాల్లో ఉన్న టీడీపీ అభిమానులను త‌మ‌వైపు తిప్పుకునేందుకు టి. కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహ‌మా ఇది అనే అనుమానం కూడా కలుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com