రివ్యూ : `వి` సినిమా – అంచనాలను అందుకోవడంలో విఫలం !

ప్రేక్ష‌కుడు చాలా తెలివైన వాళ్లు అని సినిమా వాళ్లు అంటుంటారు.  తెర‌పై ఓ స‌న్నివేశం న‌డుస్తోంటే.. దాని ముందూ – వెనుకా – త‌ర‌వాత‌.. అన్నీ చెప్పేయ‌గ‌ల స‌మ‌ర్థులు. ఓపెనింగ్ సీన్ చూసి – క్లైమాక్స్ ఏమిటో క‌నిపెట్ట‌గ‌ల‌రు. వాళ్ల తెలివితేట‌ల‌కే ప‌రీక్ష పెట్టాల‌నుకుంటే – ఇంకాస్త తెలివిగా వ్య‌వ‌హ‌రించాలి.  స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌… స‌క్సెస్ మంత్ర అదే. ఓ సుడోకో ఆడుతున్న‌ట్టు – ఛెస్ గేమ్ చూస్తున్న‌ట్టు – ఓ పొడుపు క‌థ విప్పుతున్న‌ట్టు అనిపించాలి.  ఈమ‌ధ్య వ‌చ్చిన థ్రిల్ల‌ర్ క‌థ‌లు హిట్ అయ్యాయంటే ఆ క‌థ‌ని ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుడి కంటే ఓ మెట్టుపైన నిల‌బ‌డి ఆలోచించిన‌ట్టు అర్థం. ఇంద్ర‌గంటి కూడా తెలివైన ద‌ర్శ‌కుడే. జెంటిల్‌మెన్ తో థ్రిల్ల‌ర్ జోన‌ర్ నీ.. డీల్ చేయ‌గ‌ల‌ని నిరూపించుకున్నాడు. ఇక నాని, దిల్ రాజు ఇంకా తెలివైన వాళ్లు. వాళ్ల జ‌డ్జిమెంట్ త‌ప్పిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. ఇలా ముగ్గురు తెలివైన వాళ్లు చేసిన ప్రాజెక్టు `వి`. మ‌రి ఈ `వి` విక్ట‌రీని అందించిందా?  `వి`నోదాన్ని పంచ‌గ‌లిగిందా?

* క‌థ‌

ఆదిత్య (సుధీర్ బాబు) ఓ సూప‌ర్ కాప్‌. న్యాయాన్ని కాపాడ‌డానికి అప్పుడ‌ప్పుడూ రూల్స్ బ్రేక్ చేయాల‌న్న‌ది త‌న థీరీ. దాంతో అవార్డులూ, రివార్డులూ, మెడల్స్‌. అలాంటి ఆదిత్య‌కు ప‌రీక్ష పెడుతూ.. హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌రుస‌గా మ‌ర్డ‌ర్లు జ‌రుగుతుంటాయి. హంత‌కుడు ఓ క్లూ కూడా వ‌దులుతుంటాడు. ఆ క్లూల ఆధారంగా హంత‌కుడ్ని ప‌ట్టుకోవాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా – ఫ‌లితం ఉండ‌దు. ఆ హంత‌కుడు ఎవ‌రు?  ఆదిత్య‌పైనే ఎందుకు స‌వాల్ విసురుతున్నాడు?  ఇద్ద‌రిలో ఎవ‌రు గెలిచారు? అన్న‌దే `వి`.

* విశ్లేష‌ణ‌

ఇద్ద‌రు తెలివైన వాళ్ల మ‌ధ్య పందెం ఎప్పుడూ బాగుంటుంది. `సోదాపు.. ద‌మ్ముంటే న‌న్నాపు` అంటూ స‌వాల్ విసురుకుంటే – చూడ్డానికి ఇంకా బాగుంటుంది. ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ – అంతే తెలివిగా హ‌త్య‌లు చేసే హంత‌కుడు – వీరిద్ద‌రి మ‌ధ్య ఎత్తుకు పై ఎత్తులు – ఇదీ క‌థ‌. అనుకోవ‌డానికి, ఊహించ‌డానికి స‌ర‌దాగా ఉన్నా, ఇలాంటి క‌థ‌.. తెర‌పై చూపించ‌డం అంత తేలిక కాదు. ఎందుకంటే – ఇలాంటి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలు ప్రేక్ష‌కులు చాలా చూసేశారు. వాళ్ల‌కు ఏదైనా కొత్త‌గా ఉంటేనే కిక్కు. నానిని ప్ర‌తినాయ‌కుడ్ని చేసి – కండ‌లు తిరిగిన సుధీర్ బాబు లాంటి హీరోని మ‌రో పాత్ర‌కి ఎంపిక చేసి ఆ కొత్త‌ద‌నానికి త‌గిన ఫ్లాట్ ఫామ్ వేసుకున్నాడు ద‌ర్శ‌కుడు.

కానీ క‌థ‌.., అందులో మ‌లుపులూ..?  ఇదే అస‌లైన క్వ‌శ్చ‌న్ మార్క్‌. వ‌రుస‌గా హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. వాటిని ఆప‌డానికి ఓ పోలీస్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఓ హ్య‌త ఇన్వెస్టిగేష‌న్ – మ‌ధ్య‌లో ఛాలెంజ్‌లూ, మ‌రో హ‌త్య – ఇదీ ద‌ర్శ‌కుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే. యాక్ష‌న్ దృశ్యాలు స్టైలీష్ గా, ఫోన్లో ఛాలెంజ్‌లు, ఇచ్చే క్లూలూ ఓ పిట్ట క‌థ‌లా ఉన్నా – ఏం జ‌రిగిపోతుందో? అనే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో ఏమాత్రం క‌ల‌గ‌దు.మ‌ధ్య‌మ‌ధ్య‌లో నివేదా, సుధీర్ బాబుల ట్రాక్ కూడా అంత గొప్ప‌గా ఉండ‌దు.

ఇద్ద‌రు శ‌క్తిమంతుల క‌థ ఇది. కానీ ఎప్పుడూ నానినే గెలుస్తుంటాడు. సుధీర్ బాబు చేసే ఇన్వెస్టిగేష‌న్ తేలిపోతుంటుంది. అస‌లు ఈ హ‌త్య‌లు ఎందుకు జ‌రుగుతున్నాయి? అన్న‌ది ఓ పాత్ర చేత క‌థ‌లా చెప్పించేశారు. మ‌రి.. సుధీర్ బాబు ఏం తెలుసుకున్న‌ట్టు? ఏం సాధించిన‌ట్టు. హ‌త్య‌లు జ‌రుగుతాయ‌ని, దాన్ని నానినే చేస్తాడ‌ని సినిమా చూస్తున్న‌వాళ్లంద‌రికీ తెలుసు. ఎందుకు? ఏమిటి? అన్న‌దే ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌. దాన్ని చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడి వైఫ‌ల్యం ప్ర‌తీ ఎపిసోడ్ లోనూ క‌నిపిస్తూనే ఉంటుంది.

ప్ర‌తి హంత‌కుడికీ, కిల్ల‌ర్‌కీ, సైకోకీ ఏదో ఓ బ్యాక్ స్టోరీ ఉంటుంది. `వి`లోనూ ఏదో ఉంద‌న్న విష‌యం ప్రేక్ష‌కుడికి ముందు నుంచీ అర్థ‌మ‌వుతూనే ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ ఈ సినిమాలో మ‌రో వీక్ పాయింట్‌. ఆ క‌థ విన్న త‌ర‌వాత‌… ఆ కిల్ల‌ర్ పై సానుభూతో, ప్రేమో, జాలో ఏదో ఒక‌టి క‌ల‌గాలి. ఇవి మూడూ క‌ల‌గ‌వు. `ఇలాంటివి చాలా సినిమాల్లో చూసేశాం క‌దా` అనే ఫీలింగ్ త‌ప్ప‌. ఆ బ్యాక్ స్టోరీ కూడా పోలీస్ ఆఫీస‌ర్ శోధించి, సాధించిందేం కాదు.  స‌ద‌రు కిల్ల‌ర్.. త‌న‌కు తాను చెప్పుకున్న స్టోరీ.

`రాఘ‌వేంద్ర‌రావు సినిమాలు ఎక్కువ‌గా చూస్తావా`
`బోయ‌పాటి శ్రీ‌ను సినిమాలు ఎక్కువ‌గా చూస్తావా`
అంటూ.. ప‌క్క పాత్ర‌ల్ని అడ‌గ‌డం నాని స్టైల్‌. ఇంద్ర‌గంటి థ్రిల్ల‌ర్ సినిమాలు ఎక్కువ‌గా చూసుంటాడు. వాటి ఫార్ములాలోనే ఈ క‌థ‌నీ వండేశాడు. ఆ లాజిక్కులూ, ఫ‌జిల్లూ, బ్యాక్ స్టోరీ.. ఇవ‌న్నీ పాత వాసన కొడుతుంటాయి.  మ‌ధ్య‌మ‌ధ్య‌లో రైట‌ర్ గా త‌న తెలివితేట‌ల్నీ, ప్ర‌తిభ‌నీ, త‌న‌కున్న జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌నీ ప్రేక్ష‌కుల‌కు కూడా తెలిపే ప్ర‌య‌త్నం చేశాడు. లేపాక్షి గురించి చెప్పిన డైలాగ్ అందులో భాగ‌మే అనిపిస్తుంది. నిజానికి అక్క‌డ ఆ ప్ర‌స్తావ‌న అన‌వ‌స‌రం. నాని పాత్ర డ్యూరేష‌న్ త‌గ్గిపోయిందేమో అన్న అనుమానంతో బ‌స్సు, రైలు ఎపిసోడ్స్ లో కో పాసింజర్స్‌ని భ‌య‌పెట్టే సీన్లు రాసుకున్నాడు ఇంద్ర‌గంటి. వాటివ‌ల్ల నిడివి పెరిగిందేమో గానీ, అనుకున్న ఫ‌లితం నెర‌వేర‌లేదు.

* న‌టీన‌టులు

నాని ఓ నాచుర‌ల్ స్టార్. త‌న ప్ర‌తిభ స‌హ‌జ‌సిద్ధంగా వ‌చ్చింది. తెర‌పై ఎప్పుడు క‌నిపించినా న‌టించిన‌ట్టు ఉండ‌దు. మ‌రోసారి వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ని ఎంచుకున్నాడు. త‌న డైలాగ్ డెలివ‌రీ, మాడ్యులేష‌న్ ఇది వ‌ర‌కు సినిమాల కంటే కొత్త‌గా ఉంది. సినిమా మొత్తం ఒకే టెంపోని కొన‌సాగించాడు. సుధీర్ బాబు కూడా ఓకే అనిపిస్తాడు. నాని కంటే త‌న స్క్రీన్ టైమింగే ఎక్కువ‌. మొహ‌రం ఎపిసోడ్ లో అవ‌స‌రం లేక‌పోయినా.. త‌న చొక్కా విప్పి కండ‌లు చూపించాడు. నివేదా థామ‌స్ ఎందుకో తొలిసారి కాస్త అతి చేసిన‌ట్టు అనిపిస్తుంది. అతిథి రావు హైద‌రీది అతిథి పాత్రే.

* సాంకేతిక‌త‌

పాట‌లు బాగున్నాయి, నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల్ని ఎలివేట్ చేయ‌డానికి దోహ‌దం చేసింది. ఫైట్స్ తీర్చిదిద్దిన ప‌ద్ధ‌తి స్టైలీష్ గా ఉంది. సాధార‌ణంగా ఇంద్ర‌గంటి క‌లానికి ప‌దునెక్కువ‌. అయితే ఈ సినిమాలో సంభాష‌ణ‌లు అంత‌గా పేల‌లేదు. గుర్తుండిపోయే డైలాగులు చాలా త‌క్కువ‌. నిర్మాణ ప‌రంగా.. ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. నేనూ యాక్ష‌న్ సినిమాలు చేయ‌గ‌ల‌ను.. అని నిరూపించుకోవ‌డానికి ఇంద్ర‌గంటికి ఓ కార్డ్ లా ఉప‌యోగ‌ప‌డుతుంది సినిమా.

* ఫినిషింగ్ ట‌చ్ ‌:  అంచనాలను అందుకోవడంలో విఫలం !

తెలుగు360 రేటింగ్‌: 2.5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close