ప్రేమ.. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. ప్రతి ఒక్కరికి ఒక ప్రేమకథ ఉటుంది. జీవితంలో ఎదో ఒక దశలో ఆ మాధ్యురాన్ని పొందని మనిషంటూ వుండరు. అందుకే వెండితెరపై ప్రేమకథ అనేది ఎవర్ గ్రీన్ పార్ముల. ఎన్ని ప్రేమ కథలు చూపించిన ఇంకా చూడడానికి ప్రేక్షకుడు రెడీగా వుంటాడు. ఇలా వచ్చిన ప్రేమ కథలు కొన్ని ప్రేక్షకుల మదిలో ప్రింట్ అయిపోయాయి. ప్రేమికుల రోజు సందర్భంగా వెండితెర ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ కొన్ని..
దేవదాసు:
తెలుగు కాదు.. ఇండియన్ సినిమాలోనే ”దేవదాసు’ ఆల్ టైం క్లాసిక్. ట్రెండ్ సెట్టర్. ”లవ్ స్టోరీస్ అఫ్ ఇండియన్ సినిమా” అనే పుస్తకం వేస్తే అందులో కవర్ పేజీపై నిలిచే చిత్రం అక్కినేని నాగేశ్వరరావు దేవదాస్. ఈ ప్రేమ కథ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రేమ ఇలా వుండాలి. ప్రేమకధ అంటే ఇలా వుండాలి. అంతే. ఇక ఏఎన్ఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాలి. ఈ సినిమాని చాలా భాషల్లో రిమేక్ చేశారు. కానీ ఏఎన్ఆర్ దేవదాస్ ని బీట్ చేసే సినిమా మరోటి రాలేదు. ఆ పాత్ర ఎవరు చేసినా ఏఎన్ఆర్ ముందు నిలబడలేకపోయారు. దేవదాస్ అంటే ఏఎన్ఆర్.. ఏఎన్ఆర్ అంటే దేవదాస్. అంతే.
ప్రేమాభిషేకం:
దేవదాసు తర్వాత మళ్ళీ అంతటి డెప్త్ వున్న ప్రేమకథ ప్రేమాభిషేకం. భగ్న ప్రేమికుడు దేవదాసుగా చెరగని ముద్రవేసుకున్న్ అక్కినేని మరోసారి తన నటనాకౌశలం చూపిన సినిమా ఇది. దాసరి, అక్కినేని, శ్రీదేవి, జయసుధ… నలుగురు నాలుగు స్తంభాలుగా నిలబడి.. ప్రేక్షకులతో ప్రేమాభిషేకాలు చేయించుకున్న చిత్రమిది. ప్రేమ అంతిమ లక్ష్యం.. మనం ప్రేమించిన వారి సంతోషం, సుఖం కోరుకోవడమనే పాయింట్ తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ప్రేమ సాగరంలో ముంచింది. దేవిని(శ్రీదేవి) అల్లరి పట్టించి చివరికి ఆమె ప్రేమ పొందిన రాజేష్ ( ఏఎన్ఆర్) ఇక తాను ఇంకెంతకాలమో బ్రతకనని తెలిసి తనపై దేవికి అసహ్యం పెంచుకున్నట్లు చేయడానికి తనను తాను చెడ్డవాడిగా చిత్రీకరించున్న దృశ్యాలు హృద్యంగా ప్రేక్షకుల మదిని తాకుతాయి. ఈ సినిమా మ్యూజికల్ హిట్ కూడ. ప్రతి పాట మళ్ళీ మళ్ళీ వినాలకునే పాటే. దేవి మౌనమా.. ఒక దేవత గుడిలో.. నా కళ్ళు చెబుతున్నాయి.. ఇలా అన్నీ హిట్సే. ఇక చివర్లో ”ఆగదు ఏ నిమిషం నీ కోసం” పాటలో ఏఎన్ఆర్ నటనా కౌశలం గురించి ఎంత చెప్పినా తక్కువే.
గీతాంజలి:
ప్రేమ కథల్లో దేవదాస్ తర్వాత అంతటి ప్రభావం చూపించిన సినిమా గీతాంజలి. ప్రేమ కథల స్పెషలిస్ట్ మణిరత్నం. అప్పటికే మౌనరాగం లాంటి కొన్ని ప్రేమకథను డీల్ చేశారాయన. అయితే గీతాంజలి మాత్రం వెరీ స్పెషల్. ప్రేమలోని లోతును ఆకాశమే హద్దుగా చూపించాడు మణిరత్నం ఈ సినిమాతో. అసలు గీతాంజలి ఆలోచనే వైవిధ్యం. అమ్మాయి, అబ్బాయి. ఇద్దరికీ చావు ఫిక్స్ అయిపోతుంది. అలాంటి ఇద్దరి మధ్య ఒక అందమైన ప్రేమకధను సృస్టించాడు మణిరత్నం. ఆ ప్రేమ కథకు తన సంగీతంతో ప్రాణం పోశారు ఇళయరాజా. వెరసి ఈ సినిమా ఓ క్లాసిక్. ఎంతటి క్లాసిక్ అంటే ఈ సినిమా స్ఫూర్తితో చాలా ప్రేమకథలు పుట్టుకొచ్చాయి. అదే పాయింట్ ను అటు ఇటు చేసి ఎన్నో కధలు అల్లారు. ఇక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో కూడా ఈ సినిమా పాత్ బ్రేకింగ్. ”లేపుకేల్దామన్న మగాడా? ఎక్కడా?”అని హీరోయిన్ అంత గొంతుతో అరుస్తుంటే.. జనాలు షాక్ అయిపోయారు. చలం ‘మైదానం’లో కూడా మొదట డైలాగ్ చదివి షాక్ అయ్యారో లేదో కానీ ఒక హీరోయిన్ క్యారెక్టర్ అలా మాట్లాడేసరి ఒక్కింత థ్రిల్ అయిపోయారు ఆడియన్స్. ఇదంతా మణిరత్నం ప్రేమకథలో మ్యాజిక్కే.
ప్రేమ :
విషాదాంతమైన ప్రేమ కథలు ఎప్పటికీ గుర్తుండిపోతాయనడానికి మరో నిదర్శనం వెంకటేష్ ప్రేమ. సినిమాంత చాలా సింపుల్ గా సాగిపోతుంటుంది. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రేక్షకుడిని కరుణతో ముంచేసిన కథ ప్రేమ. నిజంగా ఆ సినిమా చూస్తున్నపుడు వెంకటేష్, రేవతి కనిపించరు. పృథ్వీ, మ్యాగీ పాత్రలతో మాత్రమే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతారు. నటుడిగా వెంకటేష్ ని మరో పదిమెట్లు ఎక్కించిన సినిమా ఇది. ఈ సినిమాతో యూత్ లో వెంకటేష్ కు మరింత క్రేజ్ పెరిగింది. ఇద్దరు వ్యక్తులు, వేర్వేరు మతాలు.. వారి మధ్య ఘర్షణను చాలా సున్నితంగా డీల్ చేసి చివరికి ప్రేమే ఒక మతని ప్రేక్షకుడు చిరకాలం గుర్తుపెట్టుకునే సినిమా ఇది. మ్యూజికల్ హిట్ కూడా.
అభినందన:
ప్రేమ, విరహం, త్యాగం.. ఈ మూడు ఎమోషన్స్ చుట్టూ తిరిగిన కధ అభినందన. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా మొదలైన ఈ కధ విరహం వైపుకు టర్న్ తీసుకుటుంది. తర్వాత కాస్త దేవదాస్ ఛాయలు కనిపిస్తాయి. రాజా (కార్తి), రాణి (శోభన) తనకు దక్కలేదనే విరహంతో తాగుడుకి బానిసౌతాడు. అయితే శరత్ బాబు త్యాగం వారిద్దరిని మళ్ళీ ఒక్కటి చేస్తుంది. శరత్ బాబు పాత్రను తప్పించి చివరికి శుభం కార్డు వేస్తారు. అయితే ఈ కధను దర్శకుడి కంటే మ్యాస్ట్రో ఇళయరాజా తన భుజానవేసుకున్నాడు. ప్రేమ కథలకు సంగీతం ప్రాణమని నిరూపించిన సినిమా ఇది. జనరల్ గా ఏదైనా ఒక ఆల్బమ్ లో రెండు లేదా మూడు హిట్ పాటలు వుంటాయి. కానీ అభినందనలో పాటలన్నీ చార్ట్ బస్టర్స్. నేపధ్య సంగీతం అయితే గుండెల్ని పిండేస్తుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వస్తుందంటే ఛానల్ మార్చకుండ చూస్తారు.
మహర్షి :
మోడరన్ లవ్ స్టోరీస్ లో మహర్షి సినిమా కూడా ఒక క్లాసిక్కే. దర్శకుడు వంశీలోని డెప్త్ కు ఈ సినిమా నిదర్శనం. ఒక విధంగా ఈ సినిమా కూడా పాత్ బ్రేకింగ్. హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో. అప్పటివరకూ వచ్చిన ప్రేమ కథలలో ఎదో ఒక సీన్ దగ్గర హీరో హీరోయిన్స్ ప్రేమలో పడతారు. కానీ మహర్షి మాత్రం దీనికి డిఫరెంట్. ఇది ప్రేమ కధే కానీ.. ప్రేమించుకోవడం వుండదు. ప్రేమ కోసం ఎదురుచూపే. ఎలాగైనా తను ఇష్టపడ్డ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం ఓ కుర్రాడు పడే తపన, ఆవేదన, విరహంను వంశీ చూపించిన తీరు కట్టిపడేసింది. ఈ సినిమా విజయంలో కూడా ఇళయరాజాది కుంభభాగం. మాటరాని మౌనమిది, సుమం ప్రతి సుమం సుమం పాటలు ఇప్పటి యూత్ ముబైల్స్ కూడా నిక్షిప్తమైవుంటాయి.
తొలిప్రేమ:
న్యూ జనరేషన్ ప్రేమ కథల్లో తొలిప్రేమ అల్టిమేట్. ఎంత అల్టిమేట్ అంటే ఇలాంటి ప్రేమ కథ మళ్ళీ రాలేదేమో. అప్పటికున్న చాలా రూల్స్ ని బ్రేక్ చేసిన సినిమా ఇది. అసలు ఈ సినిమాలో డ్యూయట్లు వుండవు. సీన్ కట్ చేస్తే ఫారిన్ పాటలు వుండవు. ప్రేమ తప్పితే మరో ఎలిమెంట్ లేని సినిమా తొలిప్రేమ. ఆ ప్రేమలో కూడా స్నేహం! అదే ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్. అసలు బాలు, అను క్యారెక్టర్ల డిజైనే చాలా ఆసక్తికరంగా ఉటుంది. బాలు క్యారెక్టర్ తో ప్రతి కుర్రాడు కనెక్ట్ అయిపోతాడు. ఒక అబ్బాయి ఫస్ట్ సైట్ లోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడిపోవడం, తనకోసం వెతకడం, ఆ అమ్మాయే ఫ్రెండ్ అవ్వడం, అబ్బాయి తన ప్రేమను చెప్పలేకపోవడం.. ఇలా చాల సంఘర్షణ ఉటుంది. ఇదే సంఘర్షణ సిరివెన్నెల ఈ సినిమాలో ఓ పాటలో ఇలా రాస్తారు. ”’ఎన్నో కలలను చూసే, కన్నె కునుకొదిలేసే.. నువ్వే నను వెతికే ఆ తొలివెలుగని తెలిసే.. ”నీతో చెలిమిని చేసే.. నీలో చలువని చూసే, అయినా ఇంకా ఎదో అడిగే అత్యాశే” ఇదీ బాలు క్యారెక్టర్. అను మాత్రం తన మసులో ఏముందో అసలు హింట్ ఇవ్వని క్యారెక్టర్. ఈ రెండు పాత్రలు ఎమౌతాయి..? ఈ కధ చివరికి ఎలా ముగిస్తారో అని తెగ ఇదై పోతారు సినిమా చూసిన ప్రేక్షకులు. చివరికి ఎయిర్ పోర్ట్ లో ఒక డైలాగ్ తో శుభం కార్డు వేస్తారు. అది ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది. ఎంతలా అంటే ప్రేమ కధలు గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ తొలిప్రేమ టాపిక్కే వస్తుంటుంది. అంత జెన్యూన్ లవ్ స్టోరీ ఇది.
ఖుషి :
తొలిప్రేమ తర్వాత అంతేస్థాయిలో గుర్తుండిపోయే ప్రేమకధ మళ్ళీ పవన్ కళ్యాణే చేశాడు. అదే… ఖుషి. ఈ సినిమా కూడా చాలావైవిధ్యమైన ప్రేమకథ. ఈ సినిమాలో విలన్స్ వుండరు. విలన్స్ లేకుండా డ్రామా ఎలా ముందుకు వెళుతుంది ?! అందుకే ”ఇగో’ అనే విలన్ క్రియేట్ చేశాడు దర్శకుడు. నిజంగా ఈ ఇగో అనే మాట ఇంగ్లీష్ డిక్షనరీ వుందే కానీ ఆ పదాన్ని ప్రతి ఒక్కరూ వాడుకునేలా చేసిన క్రిడెట్ మాత్రం.. సిద్దూ, మధు పాత్రలకు దక్కుతుంది. వీళ్ళ ఇగో జనాలకు బాగా నచ్చేసింది. రెండు ఇగో క్యారెక్టర్లును రాసుకొని తెరపై ఓ మంచి ప్రేమ కధను చూపించాలనే థాటే చాలా గొప్పది. అయితే ఈ ఇగోలో కూడా మాటల్లో చెప్పలేనంత ప్రేమ. ప్రతి సన్నివేశం కూడా చాలా కొత్తగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. సిద్దూ, మధుల కెమిస్ట్రీ, పీసీ శ్రీరాం కెమరా, మణిశర్మ మ్యూజిక్.. బొడ్డు సీను.. బైబైయ్యె బంగారు రవణమ్మ.. ఇలా చెప్పుకుంటూ పొతే ఒక్కటేమిటి?! ఈ ప్రేమకథ నిజంగా ఖుషి.
నువ్వేకావలి:
ప్రేమకు పునాది స్నేహం అనే పాయింట్ ను మరోసారి వెండితెరపై చూపించిన సినిమా నువ్వేకావలి. స్నేహం అనే ఫీలింగ్ తోనే సినిమా అంతా నడిచినా.. ఇన్నర్ త్రెడ్ మాత్రం లవ్. స్నేహం అనేది ప్రేమగా మారిన తర్వాత ఈ సినిమా మరో జోనర్ లో కనిపిస్తుంది. ఇద్దరు స్నేహితులు ఎందుకు ప్రేమికులుగా ఒక్కటి కాకూడదు? ఇద్దరి మధ్య గొప్ప అండర్ స్టాడింగ్ వున్నప్పుడు పెళ్లి పేరుతో వేరే వ్యక్తి వస్తే.. వారి ఫీలింగ్స్ ఎలా వుంటాయి? అసలు విడిపోవాలనే ఆలోచనే ఎంత నరకంగా ఉటుంది ? ఇలాంటి సున్నితమైన అంశాలను చక్కగా డీల్ చేసిన కథ నువ్వేకావాలి. ఈ సినిమాలో సంగీతం, సాహిత్యం కూడా గొప్పగా వుటుంది. కళ్ళలోకి కళ్ళు పెట్టి పాట ఒక చార్ట్ బస్టర్. హార్ట్ టచింగ్. ”గొంతులో వున్న మాట నోటితో చెప్పగలం, కానీ మనసులో వున్న మాట కళ్ళతోనే చెప్పాలి’ అలాంటి డైలాగ్స్ తో త్రివిక్రమ్ అనే ట్రెండ్ సెట్టర్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన సినిమాల్లో నువ్వేకావాలి కూడా ఒకటి.
ఏమాయ చేసావె :
ప్రేమ కథలకు ప్రేమ తప్పితే ఇంకేమి అవసరం లేదు అని చాటి చెప్పిన సినిమా ఏమాయ చేసావె. న్యూ ఈజ్ లవ్ స్టోరీస్ లో ఈ సినిమాది ఓ ప్రత్యేకమైన స్థానం. ఒక రెండు పాత్రల ప్రయాణంను సినిమా కధగా రాసుకున్న గౌతమ్ మీనన్ చాలా నేచురల్ గా ఆ పాత్రలను వెండితెరపై చూపించాడు. ఈ సినిమాలో కార్తి జెస్సీలు మాత్రమే కనిపిస్తారు తప్పితే ఎక్కడా సమంత, నాగచైతన్యలు వున్నారనే ఫీలింగ్ రాదు. అంత నేచురల్ గా ఆ పేమకధను ప్రెజెంట్ చేశారు. సినిమాకి రెహ్మాన్ మ్యూజిక్ మరో అసెట్. పాటలన్నీ సూపర్ హిట్స్. యువతను కట్టిపడేసిన ప్రేమకథ ఇది. చాలా మంది ప్రేమికులపై ఈ సినిమా ప్రభావం చూపించింది. ఎక్కడివరకో ఎందుకు..?! కార్తి, జెస్సీ .. ఇప్పుడు నిజంగానే భార్యాభర్తలు.