వైసీపీ నేత వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. బెయిల్ రాని చిట్ట చివరి కేసు అయిన నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ తీర్పుతో ఆయన అన్ని కేసుల్లోనూ జామీన్లు ఇచ్చి బుధవారం సాయంత్రానికి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి పదమూడో తేదీ నుంచి వంశీ జైల్లో ఉన్నారు. కానీ ఇక్కడ వంశీకి ఓ అడ్డంకి ఉంది.
అక్రమ మట్టి తవ్వకాల కేసులో పీటీ వారెంట్ అమలు చేయకుండానే హైకోర్టు వెకేషన్ బెంచ్ ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ పై ఓ బాధితురాలితో పాటు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. బుధవారం ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగి పిటీ వారెంట్ అమలు చేయాలని ఆదేశిస్తే మరికొన్ని రోజుల్లో లోపలే ఉండాల్సి వస్తుంది. విచారణ జరగకపోతే మాత్రం బెయిల్ పై బయటకు వస్తారు. తర్వాత అయినా విచారణ జరిగినా ప్రయోజనం ఉండదు. బయటకు వచ్చిన తర్వాత పీటీ వారెంట్ అమలు చేయడానికి అవకాశం ఉండదు. కానీ బెయిల్ రద్దు చేస్తే మాత్రం మరోసారి అరెస్టు చేయవచ్చు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వంశీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసి తగులబెట్టిందే కాకుండా.. ఆ కేసులో ఫిర్యాదుదారును లొంగతీసుకుని కొన్ని వ్యవస్థలతో కలిసి కుట్రలు చేసి.. కేసును కొట్టి వేయించాలనుకున్నారు. కానీ పోలీసులు పట్టేసుకున్నారు. దాంతో ఆయన స్వయం తప్పిదంతో అరెస్టు అయినట్లయింది. నాలుగున్నర నెలల వరకూ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్యం దెబ్బతిన్నదని ఆయన చాలా సార్లు కంప్లైంట్ చేసి.. ఆస్పత్రిలో చూపించుకున్నారు. అంతా బాగుందని డాక్టర్లు చెప్పడంతో మెడికల్ కండిషన్ కింద కూడా బెయిల్ రాలేదు.