వల్లభనేని వంశీ జైలుకెళ్లిన తరవాత .. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితులు కంటికి కనిపించకుండా పోయారు. ఫోన్లు వాడటం మానేశారు. ఫిర్యాదుదారు సత్యవర్థన్ ను కూడా కిడ్నాప్ చేయడంతో అది కూడా పెద్ద కేసు అయింది. దీంతో అన్ని కేసులు మీద పడేలా ఉండటంతో.. ఆయన ప్రధాన అనుచరులు కొమ్మా కోట్లు, యర్రంశెట్టి రామాంజనేయులు పరారయ్యారు. పోలీసులు వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎన్నాళ్లు దాక్కుంటారో దాక్కోండన్నట్లుగా ఉన్నారు. దీంతో ఎప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుంటారోనని ఉలిక్కి పడుతూ ఏడాది పాటు బతికిన వారు ఇక తమ వల్ల కాదని బయటకు వచ్చారు. పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.
నిజానికి వారు పారిపోకపోతే.. ఓ మూడు నెలలకో..నాలుగు నెలలకో బెయిల్ వచ్చేది. ఈ పాటికి బయట ఉండేవారు. కానీ పారిపోవడం వల్ల వారు ఎవరితో టచ్ లో ఉండలేక..కుటుంబాన్ని వదిలి నరకం చూశారు. ఏడాది పాటు శిక్ష అనుభవించినట్లయింది. ఎక్కడయినా కనబడితే పోలీసులు అరెస్టు చేస్తారు. కనబడకుండా బతకడం కష్టం. వంశీ కూడా ఆర్థికంగా సాయం చేయడం మానేశారు. దాంతో వారు వచ్చి లొంగిపోయారు. వీరిద్దరూ చిన్న స్థాయి అరాచకులు కాదు. వంశీ చేసే ప్రతి దందాలోనూ వీరి పాత్ర ఉంటుంది.
వీరిని పోలీసులు జైలుకు పంపారు. కోర్టు రిమాండ్ విధించింది. వీరిపై చాలా కేసులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వంశీ జైలు నుంచి వచ్చాక రాజకీయంగా యాక్టివ్ కాలేదు. గన్నవరంలో మళ్లీ రాజకీయాలు చేయకపోతే వేరే ఇంచార్జ్ ను చూసుకుంటానని జగన్ హెచ్చరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయినా ఆయన మాత్రం నింపాదిగానే ఉన్నారు.