రివ్యూ: గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌

తెలుగు360 రేటింగ్‌: 3/5

సినిమా…
అంద‌రికీ ఇది ఆట విడుపు. కొంత‌మందికి జీవితం.
సినిమా… ఓ వేడుక‌
సినిమా… ఓ వేదిక‌
సినిమా చాలామందిని స్టార్స్‌ని చేసింది. ఏకంగా దేవుళ్లుగా మార్చింది.
కేవ‌లం రెండున్న‌ర గంట‌లు వినోదం పంచిన పుణ్యానికి – ఇల‌వేల్పుల‌గా మార్చింది.
సినిమాకున్న శ‌క్తి అది.. సినిమా మ‌హ‌త్తు అది.
అలాంటి సినిమా ఓ వేట‌గాడ్ని వాల్మీకిగా మార్చ‌లేదా? అన్న కాన్సెప్టుతో ‘జిగ‌డ్తాండ‌’ క‌థ పుట్టింది. ఆ సినిమా బాబీ సింహా అనే న‌టుడ్ని జాతీయ స్థాయిలో స‌గ‌ర్వంగా నిల‌బెట్టింది. కార్తీక్ సుబ్బ‌రాజ్ అనే కుర్ర ద‌ర్శ‌కుడ్ని ర‌జ‌నీకాంత్ క‌ళ్ల‌లో ప‌డేలా చేసింది. అందుకే.. ఈ సినిమాని రీమేక్ చేయాల‌న్న ఆలోచ‌న హ‌రీష్ శంక‌ర్‌కి త‌ట్టింది. మ‌రి ‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌’గా మారిన ‘జిగ‌డ్తాండ‌’లో పాత మ్యాజిక్ క‌నిపించిందా? హ‌రీష్ శంక‌ర్ ఈ క‌థ‌లో చేసిన మార్పులు, చేర్పులూ ఎలా కుదిరాయి?

ఉపోద్ఘాతంలోనే ‘జిగ‌డ్తాండ‌’ క‌థేంటో తెలిసిపోయి ఉంటుంది. ఇంకొంచెం విపులంగా చెప్పుకుంటే..
అభిరామ్ (అధ‌ర్వ‌) ద‌ర్శ‌కుడు కావాల‌ని క‌ల‌లు క‌నే కుర్రాడు. ఓ డాన్ క‌థ‌ని సినిమాగా తీయాల‌నుకుంటాడు. అత‌ని క‌థ‌కు త‌గిన ల‌క్ష‌ణాలు గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ (వ‌రుణ్‌తేజ్‌)లో క‌నిపిస్తాయి. గ‌ణేష్ ప‌క్కా మొర‌టు మ‌నిషి. ప్రాణాలు తీయ‌డం అత‌నికి ప్యాష‌న్‌. చిన్న‌ప్ప‌టి నుంచీ డ‌క్కా ముక్కీలు తిని పెరిగాడు. అత‌ని క్రూర‌త్వం చూసి తల్లి కూడా `మూగ‌`ది అయిపోతుంది. ఓ డాన్ క‌థ ఎలా ఉండాల‌ని కోరుకున్నాడో అలాంటి అంశాల‌న్నీ గ‌ణేష్ జీవితంలో క‌నిపించాయి. అందుకే గ‌ణేష్‌ని వెదుక్కుంటూ గ‌ద్ద‌ల‌కొండ‌లో అడుగుపెడ‌తాడు అభి. అక్క‌డ గ‌ణేష్ అనుచ‌రుల‌తో ప‌రిచ‌యం పెంచుకుని, వాళ్ల ద్వారా గ‌ణేష్ అస‌లు క‌థ తెలుసుకోవాల‌నుకుంటాడు. మ‌రి గ‌ణేష్ క‌థేమిటి? ఆ క‌థ‌ని అభి సినిమాగా తీశాడా, లేదా? అనేదే `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` సినిమా.

జిగ‌డ్తాండ‌లో గొప్ప మ‌లుపులేం ఉండ‌వు. కాక‌పోతే క‌థ నేప‌థ్యం కొత్త‌గా అనిపిస్తుంది. ఓ ద‌ర్శ‌కుడు డాన్ క‌థ తీయాల‌నుకోవ‌డం, ఆ డాన్‌తో ప‌రిచ‌యం పెంచుకోవాల‌ని చూడ‌డం, ఆ డానే త‌న క‌థ‌లో హీరోగా న‌టించ‌డం – ఇవ‌న్నీ కొత్తాంశాలు. ఆ నేప‌థ్య‌మే జిగ‌డ్తాండ‌కి కొత్త లుక్ వ‌చ్చేలా చేసింది. ఈ సినిమాకి బ‌లం విల‌న్ పాత్ర చిత్ర‌ణ‌. దాన్ని బాబీ సింహా పోషించిన విధానం విస్తుపోయేలా చేసింది. అందుకే ఆ సినిమా అంత మంచి విజ‌యం సాధించింది. హ‌రీష్ శంక‌ర్ ఈ క‌థ‌ని ఎంచుకోవ‌డం కంటే, ఆ పాత్ర‌కోసం వ‌రుణ్‌తేజ్‌ని వెదికిప‌ట్టుకోవ‌డంలోనే త‌న తెలివితేట‌లు ఎక్కువ‌గా చూపించాడ‌నిపిస్తుంది. వ‌రుణ్‌ని అంత క్రూరంగా, అంత రాగా చూడ‌డం తెలుగు ప్రేక్ష‌కుల‌కు థ్రిల్లింగ్ ఎలిమెంటే. `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` చూడాలి అనే ఉత్సుక‌త ప్రేక్ష‌కుల‌లో ఏర్ప‌డ‌డానికి వ‌రుణ్ ఓ కార‌ణంగా నిలిచాడు.

హ‌రీష్ బ‌లం… త‌న క‌లం. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని బాగా రాస్తాడు. స‌త్య పాత్ర‌ని అందుకోసం వాడుకున్న విధానం, తొలి స‌న్నివేశాల్లో పండించిన హాస్యం – సినిమాని స్మూత్‌గా న‌డిపించేశాయి. పెళ్లి చూపుల సీన్‌లో క‌థానాయిక వీరంగం, సాగ‌ర సంగ‌మం సీన్లు బాగా పండాయి. కానీ ఈ రోజుల్లో కూడా ముస‌ల‌మ్మ‌లంతా ఓ చోట కూర్చుని డీవీడీ ప్లేయ‌ర్‌లో సాగ‌ర‌సంగ‌మం సినిమా చూడాల‌నుకోవ‌డం ఏమిటో? అవుడ్డేటెడ్ థీమ్‌. కాక‌పోతే… ఆ సీన్‌ని తీర్చిదిద్దిన విధానం ఈ లాజిక్‌ని కూడా మ‌ర్చిపోయేలా చేస్తుంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌కి ముందు న‌డిచిన సుదీర్ఘ మైన స‌న్నివేశం ఉత్కంఠ‌త‌ని రేకెత్తిస్తుంది. తొలి స‌గంలో ఎలాంటి కంప్లైంట్స్ ఉండ‌వు కూడా. ద్వితీయార్థంలో విల‌న్ హీరో అవుతాడు. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ కెమెరా ముందుకొస్తాడు. అక్క‌డ విల‌నిజాన్ని ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చింది. ఎప్పుడైతే విల‌న్ క్యారెక్ట‌ర్ హీరోగా మారిందో.. అప్పుడే అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న జోష్ త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. మ‌ళ్లీ శ్రీ‌దేవి వ‌చ్చి – `ఎల్లువొచ్చే గోదార‌మ్మా..` అంటూ డ్యూయెట్ పాడుకున్నంత వ‌ర‌కూ క‌థ‌లో, క‌థ‌నంలో ఊపురాదు. బ్రహ్మాజీ `ఏ ప్ల‌స్ బీ హోల్ స్క్వేర్ ఫార్ములా` కాస్త ప‌ట్టుత‌ప్పిన‌ట్టు, ఓవ‌ర్ అయిన‌ట్టు అనిపించినా – ద్వితీయార్థంలో అంత‌కు మించిన కామెడీని మిక్స్ చేసే వీలు ద‌క్క‌లేదు. గ‌ణేష్ ఫ్లాష్ బ్యాక్‌, చివ‌రి స‌న్నివేశాల్లో ఎమోష‌న్స్‌… ఇవ‌న్నీ హ‌రీష్ యాడ్ చేసుకున్న అంశాలు. అవి `ఆహా` అనిపించేలా లేవు. అలాగ‌ని తీసి పారేసేట్టూ అనిపించ‌వు. ఈ యాడింగుల వ‌ల్ల సినిమా లెంగ్త్ పెరిగి – స్పీడు త‌గ్గింది. ట్రిమ్ చేసుకోద‌గిన విష‌యాలు చాలానే క‌నిపిస్తున్నా ద‌ర్శ‌కుడు పూర్తిగా మొహ‌మాటానికి ప‌డిపోయాడు.

సినిమా నేప‌థ్యాన్ని, గొప్ప‌ద‌నాన్నీ చెప్పే స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు బాగా రాసుకున్నాడు హ‌రీష్‌. సినిమా గురించి ప‌లికిన ప్ర‌తీమాటా.. గొప్ప‌గా అనిపిస్తాయి. సినిమాపై త‌న‌కున్న ప్రేమ‌నీ, ఫ్యాష‌న్‌నీ హ‌రీష్ ఈ రూపంలో చూపించుకున్నాడు అనిపిస్తుంది. మిగిలిన చోట కూడా హ‌రీష్ డైలాగులు బాగానే పేలాయి. ఎప్పుడూ క్లాసీ మెలోడీ పాట‌ల‌తో స‌ర్దుకుపోయే మిక్కీలో కూడా మాస్ ఇంజెక్ట్ చేసేశాడు హ‌రీష్‌. త‌నిచ్చిన ‘ఒక్క ఒక్క ఒక్క‌’ ఆర్‌.ఆర్ స‌న్నివేశాల్ని బాగా ఎలివేట్ చేశాయి. ఎల్లువొచ్చే గోదార‌మ్మ‌.. పాట‌ని పాడు చేయ‌లేనందుకు సంతోషించాలి. ఆ పాట టైమింగ్ ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరింది. ఆర్ట్ విభాగం చాలా బాగా ప‌నిచేసింది. మేకింగ్ విష‌యంలో నిర్మాత‌లు ఎక్కడా రాజీ ప‌డ‌లేదు.

వ‌రుణ్‌ని గ‌ణేష్ పాత్ర కోసం ఎంచుకోవ‌డంతోనే ఈ సినిమా స‌గం స‌క్సెస్ అయ్యింది. ఈ పాత్ర‌లో ఇప్పుడు మ‌రొక‌ర్ని ఊహించ‌లేం.వ‌రుణ్ మేకొవ‌ర్ ఈసినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. త‌న న‌వ్వు, చూపు, మాట‌… ఇవ‌న్నీ భ‌యపెట్టాయి. బాబీ సింహా పాత్ర‌ని మ్యాచ్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. కానీ… వ‌రుణ్‌దాన్ని సాధించాడు. ఇదే క‌థ‌ని వ‌రుణ్‌ని పక్క‌న పెట్టి చూస్తే ఏమాత్రం ఎక్క‌దు. వ‌రుణ్ ఇచ్చిన ఇంపాక్ట్ అది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల‌లో చాలా అందంగా క‌నిపించాడు. అధ‌ర్వ చ‌క్క‌గా న‌టించాడు. అయితే ఆ పాత్ర‌లో మ‌న‌కు తెలిసిన హీరో క‌నిపిస్తే.. దాని ఎఫెక్ట్ ఇంకో రేంజులో ఉండేది. స‌త్య‌కు చాలా రోజుల త‌ర‌వాత మంచి పాత్ర ప‌డింది. త‌న బాడీ లాంగ్వేజ్‌తో న‌వ్వించాడు. మృణాళిని అందంగా ఉంది. పెళ్లి చూపుల సీన్‌లో రెచ్చిపోయింది. మిగిలిన‌వాళ్లంతా ష‌రా మామూలుగా మెప్పించారు. అతిథిగా ఒకే ఒక్క స‌న్నివేశంలో క‌నిపించాడు నితిన్‌. అక్క‌డ కూడా ప‌వ‌న్‌పై త‌న భ‌క్తిని చూపించుకున్నాడు. హ‌రీష్ కూడా ప‌వ‌న్ భ‌క్తుడే కాబ‌ట్టి – ప‌వ‌న్‌పై త‌నకున్న‌ ప్రేమ‌నీ ఈ స‌న్నివేశంలో రంగ‌రించాడ‌నిపిస్తుంది.

ద్వితీయార్థంలో కొన్ని లోపాలు, లోటుపాట్లు క‌నిపిస్తాయి. కాక‌పోతే.. ఓ రీమేక్‌ని, అందునా ప‌క్క భాష‌లో ఓ రాజ‌ముద్ర వేయించుకున్న సినిమాని ఈ స్థాయిలో తీయ‌డం కూడా గొప్పే. హ‌రీష్ ఈ విష‌యంలో పాస్ అయిపోయాడు. త‌న పెన్ ప‌వ‌ర్‌, వ‌రుణ్‌తేజ్ పెర్ఫార్మెన్స్‌, మిక్కీ సంగీతం ఈ సినిమాని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాయి. జిగ‌డ్తాండ హ్యాంగోవ‌ర్‌తో సినిమా చూస్తే ‘ఏముందిలే..’ అనిపించొచ్చు. ఓ తెలుగు సినిమాలా చూస్తే మాత్రం ఈ గ‌ణేష్ న‌చ్చేస్తాడు.

ఫినిషింగ్ ట‌చ్‌: సిటీ మార్‌

తెలుగు360 రేటింగ్‌: 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com