‘వాల్మీకి’ ట్రైల‌ర్‌: బ‌ప్పీల‌హ‌రి + గ‌వాస్క‌ర్ లా చిత‌క్కొట్టేశాడు

మాస్ ప‌ల్స్ తెలిసిన దర్శ‌కుల‌లో హ‌రీష్ శంక‌ర్ ఒక‌డు. గ‌బ్బ‌ర్ సింగ్‌లోనే త‌న మాస్ రేంజ్ ఏమిటో అర్థ‌మైపోయింది. ఇప్పుడు `వాల్మీకి`లో అది మ‌రింత విజృంభించింది. త‌మిళ `జిగ‌డ్తాండ‌`కి రీమేక్ ఇది. వ‌రుణ్‌ తేజ్ గ్యాంగ్ స్ట‌ర్‌గా న‌టించాడు. ఈనెల 20న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

`ఫామ్ హోస్ లో ఉన్న డాన్‌ని కాదురా.. ఫామ్ లో ఉన్న డాన్‌ని వెదికిప‌ట్టుకోవాలి` – అనుకునే ఓ ద‌ర్శ‌కుడికి గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ అనే ఓ డాన్ కీ మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. ఆ డాన్‌ని ద‌ర్శ‌కుడు వాల్మీకిగా ఎలా మార్చాడ‌న్న‌దే క‌థ‌. జిగ‌డ్తాండ‌లోని సోల్‌ని తీసుకుని, హ‌రీష్ శంక‌ర్ త‌న శైలికి అణుగుణంగా మార్చి తీశాడు. టీజ‌ర్‌లో విజృంభించిన‌ట్టే ట్రైల‌ర్‌లోనూ వ‌రుణ్ తేజ్ త‌న విశ్వ‌రూపం చూపించాడు. వ‌రుణ్ మేకొవర్‌, డైలాగ్ డెలివ‌రీ మొత్తంగా మారిపోయింది. అదే ఈ సినిమాకి డ్రైవింగ్ సోర్స్ గా మారింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలోని హంగులన్నీ ఇందులో ఇమిడ్చేశాడు హ‌రీష్. ముఖ్యంగా సింగిల్ లైన్ల‌కు పేరొందిన హ‌రీష్ మ‌రోసారి త‌న పెన్ బ‌లం చూపించాడు.

నాపైన పందాలేస్తే గెలుస్త‌రు.. నాతోటి పందాలేస్తే స‌స్త‌రు
మ‌నం బ‌తుకుతున్న‌మ‌ని ప‌దిమందికి తెల్వ‌క‌పోతే ఇక బ‌తుకుడెందుకురా
జింద‌గీ మాద‌చ్చోద్ తంబీ.. ఉత్త గీత‌లే మ‌న చేతిలో ఉంటాయి… చేత‌లు ఉండ‌వు
గ‌వాస్క‌ర్ సిక్సు కొట్టుడు.. బ‌ప్పీల హ‌రి పాట కొట్టుడు.. నేను బొక్క‌లిర‌గ్గొట్టుడు.. సేమ్ టూ సేమ్‌

ఇలా డైలాగుల‌న్నీ మాసీ మాసీగా ఉన్నాయి. మిక్కీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, కెమెరా వ‌ర్క్‌, ఆర్ట్ ప‌నిత‌నం ఇవ‌న్నీ ఈ ట్రైల‌ర్ రేంజ్ పెంచేశాయి. మొత్తంగా మాస్‌కి ఫుల్ మీల్స్ లాంటి సినిమా త‌యారైంద‌ని మాత్రం అర్థ‌మైంది. జాత‌క‌మేంటో 20న తేలుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.