వరలక్ష్మిని ఏమి కోరుకోవాలి ? ఏవి వద్దు..

శ్రావణమాసం పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి పూజచేయడం హిందువులఆనవాయితీ, సాంప్రదాయం. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజించే మహాపండుగ ఇది. ఈ పూజావిధినే వరలక్ష్మీవ్రతం అని పిలుచుకుంటున్నాం. వరాలు కుమ్మరించే వరలక్ష్మి శ్రీమహావిష్ణువు భార్య. విష్ణువక్షస్థలమే ఆమె నివాసం. క్షీరసాగర మధనంలోనుంచి ఉద్భవించిన కన్యక. అందుకే క్షీరాబ్దికన్యకైంది. శ్రీమహావిష్ణువుని పెళ్ళాడి ఆదిలక్ష్మి అయింది.

అయితే అష్టలక్ష్మి రూపాల్లో మనకు ఈ వరలక్ష్మి రూపప్రస్తావన కనబడదు. అష్టలక్ష్ములలో ఆదిలక్ష్మి తర్వాత ఆకలితీర్చే ధాన్యలక్ష్మి, గుండె నిబ్బరాన్ని ప్రసాదించే ధైర్యలక్ష్మి, సర్వసంపదలకు ప్రతిరూపుగా నిలిచే గజలక్ష్మి, పిల్లాపాపలను అనుగ్రహించే సంతానలక్ష్మి, గెలుపును అందించే విజయలక్ష్మి, అక్షరజ్ఞానాన్ని ప్రసాదించే విద్యాలక్ష్మి, సంపదను ప్రసాదించే ధనలక్ష్మి – ఇలా అష్టలక్ష్ములు మనల్ని అనుగ్రహిస్తుంటాయి.

వరలక్ష్మి ఎవరు ?

మరి ఈ వరలక్ష్మి ఎవరు ? పైన చెప్పిన అనేక కోరికలు తీర్చడానికి మహాలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్ములుగా అవతారమెత్తినట్టు చెప్పుకున్నాంకదా, అయితే, శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రియమైన రోజు. అందుకే ఆమె తనలోని అష్టలక్ష్మిలను మమేకంచేసి భక్తుల మేలైన సర్వకోరికలను తీర్చడంకోసం వరలక్ష్మిగా ఆవిర్భవించింది. ఏడాది పొడువునా వివిధ లక్ష్మీరూపాలను ప్రసన్నంచేసుకోవడం ఒక ఎత్తైతే, ఈ ఒక్కరోజు వరలక్ష్మిని ఆవాహనచేసి ఆమెను ప్రీతిపాత్రం చేసుకుంటే జీవనం సకలసౌఖ్యాలతో సాగిపోతుంది.

కోరికలంటే, ఎమిటవి ?

వరలక్ష్మిని కొలిస్తే కోరిన వరాలు ఇస్తుందనడంలో సందేహంలేదు. అయితే మనం భక్తితో ఎలాంటి కోరికలు కోరుకోవాలన్నదే జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ప్రత్యక్షమైతే ఏవో అల్పకోరికలు కోరడం మనలోని అజ్ఞానాన్ని సూచిస్తుంది. జ్ఞానులు ఏంచెబుతున్నారంటే, వరాలిచ్చే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు జీవనసాఫల్యానికి అవసరమైనవాటినే కోరుకోవాలి. పూర్వం ఒక అసురుడు వేలాది సంవత్సరాలు తపస్సుచేసి మహాదేవుడ్ని మెప్పించి వరం కోరుకున్నాడు, శివుడు తథాస్తన్నాడు. ఈ అసురుడు కోరుకున్నదేమంటే, తాను ఎవరితలపై చేతినిపెడితే అతగాడు భస్మమైపోవాలని. ఎంతదారుణమైన కోరిక ఇది. కేవలం తన స్వార్థంతో కోరిన కోరిక ఇది. అయినా భక్తవత్సలుడుకాబట్టి శివుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. అప్పటినుంచి ఈ రాక్షసుడు భస్మాసురడయ్యాడు. చివరకు తానే భస్మమయ్యాడు. అలాగే హిరణ్యకశిపుడి ఉదంతం తెలుసుగదా. తాను ఇక్కడ చావకూడదూ, అక్కడ చావకూడదూ, ఇలా మరణం రాకూడదు, అలానూ రాకూడదంటూ అనేక షరతులతో కూడిన వరం కోరుకున్నాడు. అయినా ఈ షరతులకు అతీతంగా మరో విధంగా రాక్షస వధ తప్పలేదు. కనుక మనం కోరిక చాలా పవిత్రంగా ఉండాలి. దుష్టమైన కోరికలు కోరితే అవి చివరకు మనకే చేటు. కాబట్టి కోరికలేవో, కానివేవో మనకు స్పష్టత ఉండాలి.

ఏవి కోరుకోవాలి…

1. తన భర్త, పిల్లలు సన్మార్గంలో సంచరించాలి. వారు ఆరోగ్యవంతులై సమాజానికి మేలుచేసేవారిగా ఉండాలి. జీవితగమనానికి కావాల్సిన సంపద అందించాలి.

2. తన పుట్టుకకు పరమార్ధం అవగతంచేసి అందుకు మార్గం సులభతరంచేయాలి. ఈ కార్యసాధనలో అవసరమైన ఆరోగ్య, బుద్ధి, సంపదలను ప్రసాదించాలి.

3. తన కుటుంబసభ్యుల జీవనమార్గంలో ఎలాంటి అడ్డంకులురాకుండా చూడాలి. (కుటుంబం బాగుండాలని కోరుకోవడంలో తప్పులేదు.కాకపోతే అది సన్మార్గ దిశగానే ఉండాలి)

4. పృథ్వి, ఆకాశం, జలం, వాయువు అగ్నివంటివి సకల జీవరాశులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలి.

5. తెలియక ఇతర జీవరాశుల పట్ల చేసిన దోషాలు తొలిగిపోవాలి. ప్రకృతితో మమేకమైసాగేలా చూడాలి.

6. కామక్రోధమోహమద మాత్సర్యములపై నియంత్రణ ఉండేలా చూడాలి.

7. శాంతిస్థాపన కోసం నేనుచేసే ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగేలా చూడు.

8. నేను, నా కుటుంబం, నేనుండే సమాజం, నా పవిత్రదేశం ఏరకమైన ఈతిబాధలులేకుండా చూడాలి.

9. సత్సంతానం కలగాలి. సనాతన ధర్మాలను, ఆచారాలను వారు పాటిస్తూ ముందుతరాలవారిచేత వాటిని పాటింపచేసే మనోసంకల్పం చెప్పుకునేలా చూడాలి.

10. ఈ జీవితం నువ్వు ఇచ్చిన ప్రసాదం. అవసానదశలో ఏరకమైన క్లేశాలు లేకుండా ఈ ఆత్మ సుఖంగా పరమాత్మలో లీనమయ్యేలా చూడు.

కోరుకోకూడనవి…

1. నేను,నా కుటుంబసభ్యులు మిగతా వాళ్లకంటే హెచ్చుస్థాయిలో ఉండేలా చూడాలి.

2. ఎవ్వరికి లేనంత సంపద కలగాలి

3. నేను ఏది కోరుకుంటే అది ఇట్టే తీరిపోవాలి

4. ఎంతటి కరువుకాటకాలొచ్చినా నా కుటుంబానికి మాత్రం తినడానికి తిండి, తాగడానికి నీరు లభ్యమవుతూనే ఉండాలి.

5. యుద్ధాలు వచ్చినా, దేశం అల్లకల్లోలమైనా నా కుటుంబానికి మాత్రం రవ్వంత ఇబ్బంది కలగకూడదు.

6. అందరూ నామాటే వినాలి. నేను సర్వాధికారికావాలి.

7. అంతులేని సంపద నాసొంతం కావాలి.

8. నిన్ను పూజించి పిలవగానే నాకు పలకాలి. నా సర్వ కోరికలు తీర్చాలి. నీకిచ్చే కానుకలనుబట్టి నాకోరికలను సత్వరం తీర్చాలి.

9. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ సమాజం ఎత్తుపీట వేయాలి.

10. వందతరాలకు సరిపడా సంపద కురిపించాలి.

వరలక్ష్మి దేవిని లేదా మరే దేవతనైనా మనఃశాంతికోసం పూజించాలి. ఇతరులు శాంతిసౌభాగ్యాలతో తులతూగాలని కోరుకోవాలి. అంతేగాని గొంతెమ్మ కోరికలు కోరితే పైన చెప్పినట్టు భస్మాసురునికి పట్టినగతే పడుతుందని గుర్తుంచుకోవాలి. అలాగే, శక్తిమేరకు పూజాదికాలు ఉండాలేతప్ప, బంగారు విగ్రహం, అటూఇటూ స్వర్ణ గజాలను ఏర్పాటుచేసి ఆర్భాటంగా పూజకు సన్నాహాలు చేసినంతమాత్రాన ఆతల్లి ఇట్టే కరుణిస్తుందని భావించకూడదు. భక్తితో పసుపుముద్దనే మాత వరలక్ష్మిగా భావిస్తూ ఇరువైపులా పసుపు ముద్దలనే ఏనుగులు (గజాలుగా) భావిస్తూ సంపూర్ణ శ్రద్ధతో పూజించి, మాతయందు మనసులగ్నంచేసి జీవన సాఫల్యత సిద్ధించమని కోరుకోవాలి. ఆమె తప్పక అనుగ్రహిస్తుంది. జీవితానికి పరమానందం కలిగించేది తృప్తే అన్న సంగతి గుర్తించాలి. అదే మనకు ప్రాప్తించే సకలైశ్వర్యం. Telugu360.com వీక్షకులకు వరలక్ష్మి శుభాకాంక్షలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close