వెంకయ్య రాజకీయం…..మోడీ, బాబులు కూడా బలాదూర్

రాజకీయాలు శతృత్వం స్థాయికి ఎప్పుడో వెళ్ళిపోయాయి. సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థి వర్గాల నాయకులనే నామరూపాల్లేకుండా చేస్తున్న పరిణామాలను చూస్తున్నాం. ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీ పేరును ఎంపిక చేసినప్పుడు వ్యతిరేకించిన అద్వానీతో సహా అద్వానీ వర్గం నాయకులందరి పరిస్థితి ఇప్పుడేంటో తెలిసందే. ఇక రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ ప్రత్యర్థి పార్టీలను ఎంతలా నాశనం చెయ్యాలో అంతా చేసిన ఇద్దరు చంద్రుల ఘనకార్యం కూాడా మనకు తెలిసిందే. ఇలాంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా వెంకయ్య నాయుడులాంటి వాళ్ళు అమోఘమైన ప్రతిభ చూపిస్తుంటారు. విమర్శల జోలికిపోకుండా మౌనంగా పదవులు అనుభవించేవాళ్ళకు పెద్దగా శతృవులు ఉండకపోవచ్చు కానీ వెంకయ్యలాగా విమర్శలతో విరుచుకుపడుతూ కూడా అందరు నాయకులతోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం అంటే మాత్రం నిజంగా గొప్ప విషయమే. ఆ స్థాయి ప్రతిభ వెంకయ్య సొంతం.

జగన్‌కి నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. తెలుగు దేశం నేతలు విరుచుకుపడిపోతున్నారు. జగన్‌కి మోడీతో మీటింగ్ నైతిక మద్ధతు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ ఆందోళన అర్థం చేసుకోదగ్గదే. అందుకే పరోక్షంగా నరేంద్రమోడీని కూడా కార్నర్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక బిజెపి నేతలు కూడా ఈ సారి ఘాటుగా స్పందించారు. జగన్‌ని సమర్థిస్తూ కూడా మాట్లాడారు. బిజెపి-టిడిపిల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకుంటున్నప్పటికీ వెంకయ్య మాత్రం చాలా లౌక్యం ప్రదర్శిస్తున్నాడు. పొత్తుకు బ్రేకప్ చెప్పే పరిస్థితులు వచ్చినప్పటికీ వెంకయ్య మాత్రం అస్సలు నోరు మెదపడం లేదు. నిజానికి మిగతా అందరు నాయకులకంటే వెంకయ్యకే ఇది చాలా పెద్ద సంకట స్థితి. జగన్‌కి మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వడాన్ని ప్రశ్నించలేడు. అలా చేస్తే వెంకయ్యను కూడా మరో అద్వానీని చేసెయ్యగలడు మోడీ. అలా అని చెప్పి చంద్రబాబుకు వ్యతిరేకంగా…..మరీ ముఖ్యంగా జగన్‌కి ప్లస్ అయ్యేలాగా వెంకయ్య నోటి నుంచి ఎప్పటికీ మాటలు రావు. అందుకే చాలా తెలివిగా మోడీ-జగన్‌ల మీటింగ్‌పై మౌనవ్రతం పాటిస్తున్నాడు వెంకయ్య. అద్వానీ మద్ధత్తుతో స్థానికంగా ప్రజాబలం లేకపోయినప్పటికీ ఏకంగా బిజెపికే అధ్యక్షుడైన వెంకయ్య ఆ వెంటనే మోడీ హవా మొదలవ్వగానే అద్వానీకి హ్యాండ్ ఇచ్చి మోడీ పంచన చేరాడు. అలాగే బిజెపి-టిడిపిల మధ్య పొత్తు లేనప్పుడు కూడా చంద్రబాబు అండ్ ఆయన భజన మీడియాతో సత్సంబంధాలు నిలుపుకోవడంలో వెంకయ్య దిట్ట. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం వెంకయ్యే అని రాజకీయ విశ్లేషకులు, బిజెపి నాయకులు కూడా చెప్తూ ఉంటారు. వెంకయ్య ఉన్నంత కాలం రాష్ట్ర బిజెపి టిడిపికి తోక పార్టీలా ఉండాల్సిందే అని బిజెపి నాయకులు బహిరంగంగానే మాట్లాడేశారు. అయినప్పటికీ బిజెపిలో మాత్రం వెంకయ్య హవా ఏ మాత్రం తగ్గదు. అద్వానీ, మోడీ….రేపు ఇంకెవరైనా వచ్చినా కూడా వెంకయ్య ప్రాధాన్యం మాత్రం ఏమీ తగ్గదు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచేంత ప్రజా బలం లేకపోయినప్పటికీ ఈ స్థాయిలో ప్రాముఖ్యత నిలుపుకోవడం, పరస్పరం ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు నిలుపుకోవడం అంటే మాటలా? దట్ ఈజ్ వెంకయ్య రాజకీయం. ఇలాంటి విషయాల్లో మోడీ, చంద్రబాబులతో సహా వెంకయ్య స్థాయి ప్రతిభ ఉన్న నాయకుడు మరొకరు ఎవరైనా దేశంలో ఉన్నారా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com