వెంకటేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోందని సమాచారం. హారిక హాసిని సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. చాలా త్వరితగతిన షూటింగ్ ముగించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. 2026 వేసవి బరిలో ఈ చిత్రాన్ని నిలపాలన్నది ప్లాన్. త్రివిక్రమ్ స్టైల్ లో సాగే ఓ క్లీన్ ఎంటర్టైనర్ ఈ సినిమా. ఎలాంటి యాక్షన్ హంగామాకూ తావు లేకుండా కుటుంబ కథా చిత్రంగా మలుస్తున్నారని టాక్. టైటిల్ ఏమిటన్నది ఇంకా చెప్పలేదు. అయితే ఈ చిత్రానికి ‘అబ్బాయి గారు 60 ప్లస్’ అనే పేరు పరిశీలిస్తున్నార్ట.
వెంకటేష్ – ఈవీవీ సత్యనారాణ కాంబోలో విడుదలైన సినిమా ‘అబ్బాయి గారు’. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్. ఇప్పుడు అదే టైటిల్ ఇప్పుడు రిపీట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. ‘మల్లీశ్వరి’లో పెళ్లికాని ప్రసాద్ టైపు క్యారెక్టర్ లో వెంకీ కనిపిస్తాడని, ముదురు బ్రహ్మచారి ముచ్చట్లని ఈ సినిమాలో చూసే అవకాశం ఉందని ఇన్ సైడ్ వర్గాల టాక్. వెంకీకి ఎలాంటి క్యారెక్టర్ అయినా సూట్ అయిపోతుంది. పైగా ఈమధ్య ‘సంక్రాంతికి వస్తున్నాం’లో తన వయసుకి తగ్గ పాత్రలోనే కనిపించారు. వెంకీ వయసు ప్రస్తుతం 64 ఏళ్లు. కాబట్టి ఇది కూడా ఆయన వయసుకి తగ్గ టైటిలే అనుకోవాలి. చిత్రబృందం త్వరలోనే టైటిల్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.