గోపాల గోపాల తరవాత మరో సినిమా మొదలెట్టాడనికి బాగా గ్యాప్ తీసుకొన్నాడు వెంకటేష్. అయితే బాబు బంగారం తరవాత మాత్రం తన స్పీడు చూపించబోతున్నాడు. ఈ సినిమా ఈనెల 12న విడుదల అవుతోంది. ఈలోగా రెండు సినిమలపై సంతకాలు చేశాడు. ఒకటి.. బాలీవుడ్ సినిమా సాలా ఖదూస్కి రీమేక్. మరోటి కిషోర్ తిరుమల సినిమా. నేను శైలజతో హిట్టు కొట్టాడు కిషోర్ తిరుమల. వెంటనే వెంకీ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ అక్టోబరు నుంచి ప్రారంభం కానుంది. మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పై పూస్కూర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘మల్లీశ్వరి’, ‘నువ్వునాకునచ్చావ్’ తరహాలో కుటుంబ సమేతంగాచూడదగిన సినిమా ఇదని చిత్రబృందం చెబుతోంది.
మరోవైపు సాలా ఖదూస్ రీమేక్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటు ఈ రీమేక్ అటు.. కిషోర్ తిరుమల సినిమాని ఏక కాలంలో పట్టాలెక్కించాలన్నది వెంకీ ప్లాన్. త్వరలోనే సాలా ఖదూస్ రీమేక్ కూడా మొదలైపోనుంది. ఇక వెంకీ ఫుల్ బిజీ అన్నమాట. కిషోర్ తిరుమల సినిమాకి సంబంధించిన కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. ఆమె ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.