వెంకటేష్….సింప్లిసిటీ అనే పదానికి నిలువెత్తు సాక్ష్యం. మేం సింపుల్‌గా ఉంటాం, ఇగోలకు చాలా దూరం, యోగిలా బ్రతుకుతూ ఉంటాం అని చాలా మంది పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. కానీ వెంకీకి మాత్రం అలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. సినిమా గురించి మాత్రమే మాట్లాడతాడు. తన ఫ్యామిలీ గురించో, గొప్పల గురించో మాట్లాడడానికి కూడా ఇష్టపడడు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు కొన్ని అయినా వస్తూ ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం వెంకీనే. తనకు ఎంత పేరొస్తుంది? ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అనే విషయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతాడు. అందరితో కలిసిపోతాడు. నంబర్ ఒన్ ప్రొడ్యూసర్ రామానాయుడి కొడుకుని, వరుస హిట్స్ ఇచ్చిన హీరోని అన్న గర్వం వెంకీలో ఇసుమంత కూడా కనిపించదు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా చేయడం మాత్రమే వెంకీకి తెలుసు.
ఇప్పుడు కూడా అలాంటి ఓ బెస్ట్ వర్క్‌తో మన ముందుకు వచ్చాడు వెంకీ. సాధారణంగా మెస్సేజ్‌లు ఇవ్వడమంటే మన హీరోలకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే స్మోకింగ్, డ్రింకింగ్ ఆరోగ్యానికి హానికరం అన్న ఒక్క సింగిల్ లైన్ మెస్సేజ్‌ని కూడా ఎన్నో రకాలుగా, ఎటకారంగా చెప్పేసి కామెడీ చేసి పడేశారు. కానీ వెంకీలో మాత్రం సిన్సియారిటీ కనిపించింది. ఎంతమంది వింటారు? ఎంత మంది ఫాలో అవుతారు? అనే విషయాలతో సంబంధం లేకుండా తను చెప్పదల్చుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్పాడు. విన్నవాళ్ళ గుండెలోతుల్లోకి తన మాటలు వెళ్ళేలా, వాళ్ళ ఆలోచనల్లో తను చెప్తున్న మెస్సేజ్ బలంగా నిలిచిపోయేలా అద్భుతంగా చెప్పాడు వెంకీ. అందుకే వెంకీకి హ్యాట్సాఫ్.
ఇక ఈ వీడియోలో చెప్పిన మాటలు కూడా నిజం. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్, ప్రేమ…లాంటి అన్ని విషయాల్లోనూ మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ మాటలకు, ఎమోషన్స్‌కి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. ఇంట్లో వాళ్ళు, మీడియా, సినిమాలు, స్నేహితులు, మనకు కనిపించే పరిసరాలు, వ్యక్తులు మనల్ని చాలా చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాంటి వాటి అన్నింటికీ నో చెప్పడం నేర్చుకోవాలి. పరిసరాలను పరిశీలిస్తూ ఉండాలి. చుట్టూ ఉన్నవాళ్ళ నుంచి నేర్చుకోవాలి. కానీ వాటిలోంచి మనం ఏం తీసుకోవాలి? ఏ అలవాట్లను అలవాటు చేసుకోవాలి? లాంటి విషయాల్లో మాత్రం చాలా స్పష్టంగా ఉండాలి. ఒక నిమిషం, ఒక గంట, ఒక సంవత్సరం ఆనందం కోసం జీవితాన్ని ఫణంగా పెట్టటం మూర్ఖత్వం. అలాగే మేక్సిమం ఎంతకాలం బ్రతుకుతాం? బ్రతికినన్ని రోజులూ ఎంజాయ్ చేద్దాం…అనే మాటలకు కూడా దూరంగా ఉంటే బెటర్. ఆ ఒక్క అభిప్రాయమే మన ఆలోచనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. వందేళ్ళ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించినవాళ్ళు మనకళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు. మన అలవాట్లు, ఆలోచనలు, ఆశయాలు కూడా పూర్తి ఆశావహదృక్పథంతో ఉంటే మన జీవితాలకు కూడా కచ్చితంగా ఓ అర్థం పరమార్థం ఉంటుంది. సంపూర్ణ జీవితాన్ని సంతోషంగా జీవించగలం.